బండి సంజయ్‌ మాటలను ప్రజలు హర్షిస్తారా?

July 31, 2021


img

హైదరాబాద్‌ ఇందిరా పార్కులో శుక్రవారం బిజెపి అధ్వర్యంలో ‘బడుగుల ఆత్మగౌరవ పోరు’ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడిన కొన్ని మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ధర్నాకు హాజరైనవారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదట ప్రగతి భవన్‌ను కూల్చివేసి లక్ష నాగళ్ళతో దున్నించి దానిని బడుగుబలహీనవర్గాలకు పంచిపెడతాము. అక్కడే 125 అడుగుల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇదే ఫైలుపై తొలి సంతకం చేస్తాము,” అని అన్నారు. 

ఆ తరువాత ఇంతవరకు సిఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు, వాటి పరిస్థితి, తాజాగా ప్రకటించిన దళిత బంధు పధకం...దానిలో సాధకబాధకాలు, దాంతో సిఎం కేసీఆర్‌ దళితులను ఏవిదంగా మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనుకొంటున్నారో బండి సంజయ్‌ వివరించారు. ఇటువంటి విమర్శలు, ఆరోపణలు సహజమే కనుక వీటిని  ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్‌ను కూల్చివేస్తామని, లక్ష నాగళ్ళతో దున్నిస్తామని బండి సంజయ్‌ చెప్పడాన్ని ఎవరూ హర్షించలేరు. కొత్త సచివాలయం నిర్మించడానికి పాత సచివాలయాన్ని సిఎం కేసీఆర్‌ కూల్పిస్తుండటాన్ని బిజెపి కూడా తప్పు పట్టింది. కానీ మేము కూడా అదే తప్పు చేస్తామని బండి సంజయ్‌ చెపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే వాటి కారణంగానే ప్రజలు బిజెపికి దూరమయ్యే ప్రమాదం ఉంటుందని బండి సంజయ్‌ గ్రహిస్తే మంచిది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే టిఆర్ఎస్‌ కంటే తమ పార్టీ బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఏమి చేస్తుందో చెపితే అందరూ హర్షిస్తారు.


Related Post