హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈసారి ముక్కోణపు పోటీ

July 30, 2021


img

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిన తరువాత ఆ స్థానంలోకి ప్రవేశించిన బిజెపి ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. అయితే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేవంత్‌ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కనుక ఆయన కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యాక పోలింగ్ వరకు తాను అక్కడ బస చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి చెప్పడం గమనిస్తే ఈ ఉపఎన్నికను ఆయన ఎంత సీరియస్‌గా తీసుకొన్నారో అర్ధం అవుతుంది. 

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్‌ బిజెపితో పడితే సరిపోయేది. కానీ ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా గట్టిపోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఈసారి గెలుపుకోసం టిఆర్ఎస్‌ నేతలు మరింత చెమటోడ్చక తప్పదు. ఈసారి కాంగ్రెస్‌, బిజెపిల నుంచి టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఉంటుందని సిఎం కేసీఆర్‌ గ్రహించినందునే ఆయన కూడా రంగంలోకి దిగారని చెప్పవచ్చు. దళిత బందు పధకం ప్రకటన, హుజూరాబాద్‌లోనే దానిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతుండటం, ఆ పధకంపై చర్చ పేరుతో నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సమావేశం అవడం వంటివన్నీ ఈ ఉపఎన్నికను సిఎం కేసీఆర్‌ ఎంత సీరియస్‌గా తీసుకొన్నారో తెలియజేస్తున్నాయి. కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నిక కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తలపించబోతోందని భావించవచ్చు. 

సాధారణంగా యుద్ధంలో రెండు పక్షాలే పోరాడుకొంటాయి. కానీ హుజూరాబాద్‌ కురుక్షేత్రంలో మూడు పార్టీలు పోరాడనున్నాయి. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి.


Related Post