దళిత బంధు పధకానికి నిధులు విడుదల

July 30, 2021


img

హుజూరాబాద్‌ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్న దళిత బంధు పధకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు గురువారం బడ్జెట్‌ రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఈ పధకానికి సంబందించి ఇంతవరకు విధివిధానాలు ప్రకటించకుండానే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 22,290 దళిత కుటుంబాలున్నాయి. కనుక వారందరికీ ఈ పధకం ద్వారా ఆర్ధికసాయం అందజేసుందుకు రూ.2,000 కోట్లు ఇస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ రూ.500 కోట్లే విడుదల చేశారు. ఇది నియోజకవర్గంలోని 5,000 దళిత కుటుంబాలకు మాత్రమే సరిపోతుంది. 

హుజూరాబాద్‌లో ప్రారంభించబోతున్న ఈ పైలట్ ప్రాజెక్టుకు ఉపఎన్నికతో ఎటువంటి సంబందమూ లేదని టిఆర్ఎస్‌ గట్టిగా వాదిస్తోంది కనుక దీని అమలుకు నిర్ధిష్ట కాలపరిమితి లేదనే భావించవచ్చు. కనుక మిగిలిన రూ.1,500 కోట్లు ప్రభుత్వం ఉపఎన్నికలోగా విడుదల చేస్తుందా లేక ఉపఎన్నిక పూర్తయిన తరువాత విడుదల చేస్తుందా అనేది త్వరలో తెలియవచ్చు. కానీ ఈ పధకానికి రూ.2,000 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి ఇప్పుడు రూ.500 కోట్లే విడుదల చేయడంతో ప్రతిపక్షాలకు టిఆర్ఎస్‌పై దాడి చేసేందుకు బలమైన ఆయుధం అందించినట్లవుతుంది. 


Related Post