ఏడేళ్ళలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు... 15వేల పరిశ్రమలు

July 29, 2021


img

ఏడేళ్ళ క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌లో అగ్రస్థానంలో నిలుస్తుండటం అందరికీ గర్వకారణమే. మహేశ్వరంలోని ఈ-సిటీలో రూ.483 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రీమియం ఎనర్జీస్ కంపెనీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి రూ.2.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వాటితో 15,000కు సంస్థలు, పైగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. వాటిలో 80 శాతం ఇప్పటికే ఉత్పత్తి, సేవలు, వ్యాపారాలు ప్రారంభించాయని చెప్పారు. వాటిద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయని తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

ముఖ్యంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంగలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. విండ్ ఎనర్జీ (గాలి మరలతో విద్యుత్ ఉత్పత్తి)కి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నందున వివిద రంగాలలో యువత నైపుణ్యం పెంచుకోవలసి ఉందని కనుక వచ్చే నెల 5వ తేదీన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌)ను ప్రారంభిస్తామని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రావడానికి ప్రధాన కారణం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ, దూరదృష్టి, నిర్ణయాలే అని చెప్పవచ్చు. ఇదిగాక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రకటించిన సరళమైన విధానాలు (పాలసీలు), ఇస్తున్న ప్రోత్సాహకాలు, శరవేగంగా అనుమతులు, భూ కేటాయింపులు, మౌలికవసతుల కల్పన, భౌగోళికంగా హైదరాబాద్‌ అనుకూలంగా ఉండటం వంటివి అనేకం ఉన్నాయి. అన్నిటికీ మించి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండటం, రాజకీయ సుస్థిరత, బలమైన నాయకత్వంలో ప్రభుత్వం పూలనావలా నడుస్తుండటం కూడా పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి బలమైన కారణమని చెప్పవచ్చు. కనుక ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం...ప్రజల విజయమని చెప్పవచ్చు.


Related Post