తెలంగాణలో ముందస్తు అరెస్టులు..పరిపాటిగా మారాయా?

July 29, 2021


img

రాష్ట్రంలో మంత్రులు జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిపక్షనేతలు, కార్యకర్తలు కలిసి ఏదో ఓ కారణంతో నిరసనలు తెలియజేస్తూ వారి కాన్వాయ్‌కి అడ్డుపడటం లేదా వారి అధికారిక కార్యక్రమాలకు అడ్డుపడి రసాభాస చేస్తుండటం పరిపాటిగా మారిపోయింది. అలాగే వారు ఈవిదంగా చేస్తున్నారనే కారణంగా మంత్రుల పర్యటనకు ముందుగానే పోలీసులు వారిని గృహనిర్బందంలో ఉంచడమో లేదా అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించడమో పరిపాటిగా మారింది. అయితే దీనికి అసలు కారణమేమిటి? అని ఆలోచిస్తే కొన్ని సమాధానాలు కనిపిస్తాయి. 

మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం సహజమే. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారు ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆశించడం సహజమే. వారు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. కనుక ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను కట్టడి చేయడాన్ని తప్పు పట్టలేము. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్‌, బిజెపిలు ఈవిదంగా మంత్రులకు నిరసనలు తెలియజేసే సాకుతో వారిని అడ్డుకోవడం ద్వారా తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. అదీగాక ఏడేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్షాలు తమ ప్రాంతాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఇక ప్రజలు తమను పట్టించుకోరనే భయం, ఆందోళన కూడా వారిలో నెలకొని ఉంది. అందుకే వారు ఈవిదంగా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. 

అంటే అంతిమంగా అధికార ప్రతిపక్షాలు రెండూ రాజకీయంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి పోరాడుకొంటున్నట్లు భావించవచ్చు. కానీ ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను పదేపదే ఈవిదంగా అరెస్టులు చేస్తుండటం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని చెప్పవచ్చు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందనే ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చుతున్నట్లవుతుంది.                    



Related Post