ఆ పధకంపై భిన్న వాదనలు...టిఆర్ఎస్‌కే మేలు

July 29, 2021


img

సిఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు పధకంపై రాష్ట్రంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అది హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసమేనని ప్రతిపక్షాలు వాదిస్తుండగా, ఇన్ని దశాబ్ధాల తరువాత దేశంలో మొట్టమొదటిసారిగా దళితుల కోసమే ప్రత్యేకంగా సిఎం కేసీఆర్‌ ఇటువంటి ఓ గొప్ప పధకాన్ని తెస్తున్నారని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. 

ఈ పధకం పరమార్ధం ఏమిటనేది పక్కన పెడితే ‘అది ఓటర్లను ప్రలోభపెట్టడానికి తెచ్చిన పధకమే అని దానిని ఉపఎన్నిక ముగిసేవరకు నిలిపివేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ ఎన్నికల కమీషనర్‌కు లేఖ వ్రాయగా, కాంగ్రెస్‌, బిజెపి నేతలే ఆ లేఖ వ్రాయించి ఈ పధకం అమలుచేయకుండా అడ్డుపడుతున్నార్ణి టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు.

నిజానికి ఈ పధకం అమలుపై టిఆర్ఎస్‌కు చిత్తశుద్ధిలేదని, పైగా ఈ పధకం కోసం లక్షల కోట్లు ప్రభుత్వం తేలేదని కనుక ఉపఎన్నిక ముగియగానే ఆ పార్టీయే తమ వాళ్ళ చేత కోర్టులో కేసు వేయించి పధకాన్ని నిలిపివేస్తుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 

ఓ పక్క ఈ పధకంపై ఇన్ని వాదనలు వినిపిస్తుంటే ఉపఎన్నికలోగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20 వేల దళిత కుటుంబాలకు ఆ పధకం కింద రూ.10 లక్షల చొప్పున సొమ్ము చెల్లించాలని కాంగ్రెస్‌, బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి సోదరులు ఆ పధకాన్ని హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కూడా వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే పధకం అమలుచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసురుతున్నారు. 

ఒకే ఒక పధకంపై ఇన్ని వాదనలు, భిన్నాభిప్రాయాలు వినపడుతుండటం ఆశ్చర్యకరమే. అయితే ఎంతగా చర్చ జరిగితే అంతగా ఉచిత ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరెన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్రంలో దళిత బంధు పధకం అమలుకాబోతోందనే విషయం ప్రజలకు, ముఖ్యంగా...హుజూరాబాద్‌ ఓటర్లకు మనసుల్లో నాటుకొనేలా అర్ధం అవుతుంది. టిఆర్ఎస్‌ కూడా అదే కోరుకొంటోంది! తాము కష్టపడి చేయాల్సిన ఈ పనిని ప్రతిపక్షాలే చేసిపెడుతుంటే ఎందుకు కాదంటుంది?


Related Post