మమతా బెనర్జీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

July 29, 2021


img

పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ ఏకం చేసి, 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి, ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాలలో భాగంగా ఆమె బుదవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. వారు దేశంలో రాజకీయ పరిస్థితులపై సుదీర్గంగా చర్చించారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “2014 ఎన్నికలలో అచ్చే దిన్ (మంచి రోజులు) వస్తాయంటూ బిజెపి ప్రచారం చేసుకొంది కానీ అప్పటి నుంచే దేశంలో పరిస్థితులు ఇంకా దిగజారాయి. అచ్చే దిన్‌కు బదులు దేశంలో సచ్చేదిన్ (నమ్మకమైన రోజు) రావలసి ఉంది. అందుకోసం నావంతు ప్రయత్నాలు చేస్తున్నాను. బిజెపిని గద్దె దించేందుకు ఏర్పాటవుతున్న విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించినా నాకు అభ్యంతరం లేదు. దానిలో నేను ఓ సామాన్య కార్యకర్తలా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు. 

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌, బిజెపిలే దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించాయి. ఒకటి రెండుసార్లు విపక్షకూటమి కేంద్రంలో అధికారం చేజిక్కించుకొన్నప్పటికీ ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయింది. కానీ కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ, బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటములు నిరాటంకంగా ప్రభుత్వాలను నడపగలిగాయి. బలమైన నాయకత్వమే ఇందుకు కారణమని అర్ధమవుతోంది. 

కానీ కేంద్రంలో పదవులు, అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో చేతులు కలిపే పార్టీలు ఎవరి నాయకత్వాన్ని అంగీకరించవు. ఒకవేళ అంగీకరించినా ఆ నాయకత్వానికి లోబడి పనిచేసేందుకు ఇష్టపడవు. అందుకే భారత్‌లో థర్డ్ ఫ్రంట్ లేదా విపక్ష కూటములు విఫలం అవుతుంటాయి. మమతా బెనర్జీ ఏర్పాటు చేయాలనుకొంటున్న విపక్ష కూటమికి ఇదే వర్తిస్తుంది. కనుక ఆమె చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కాలమే చెపుతుంది. 


Related Post