హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులు చేయడం తప్పా?

July 28, 2021


img

హుజూరాబాద్‌ నియోజకవర్గంపై ప్రస్తుతం కురుస్తున్న వరాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి కోసం కోట్ల రూపాయలు విడుదల చేస్తుండటం, దళిత బంధు పధకం వగైరా రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీశాయి. ఇవన్నీ ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఉపఎన్నిక రావడం వలననే జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

వీటిపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో జరిగిన తాజా చర్చలో కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్, బిజెపి నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్‌ ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు. దీనిపై వారి మద్య జరిగిన వాదోపవాదాలు కూడా చాలా ఆసక్తికరంగా సాగాయి. 

అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, “మేము వందల కొద్దీ సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టామని, రాష్ట్రాన్ని అన్నివిదాల అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్:1గా నిలిపామని టిఆర్ఎస్‌ చెప్పుకొంటునప్పుడు, ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిఎం కేసీఆర్‌ ఎందుకు ఇంతగా భయపడుతున్నారు?హడావుడిగా వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు?దళిత బంధు పధకం పేరుతో ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

బిజెపి నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ రాజీనామా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని నియోజకవర్గంలో ప్రజలు అనుకొంటున్నారు. కనుక మిగిలిన నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుకోవడం సహజమే,” అని అన్నారు. 

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వారికి జవాబిస్తూ, “ఈటల రాజీనామాతో ఇవన్నీ జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈటల మంత్రిగా ఉండగానే రైతు బంధు వంటి అనేక వందల పధకాలు ప్రవేశపెట్టి అమలుచేశాము. కనుక దళిత బంధు పధకం కూడా అటువంటిదే తప్ప ఉపఎన్నిక కోసం ప్రకటించింది కాదు. బిహార్, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలప్పుడు బిజెపి ఆ రాష్ట్రాలకు వేలకోట్ల పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించింది. మరి బిజెపిని కూడా ఎందుకు ప్రశ్నించరు?అయినా ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కానేలేదు. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కూడా లేదు. కనుక హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడితే తప్పేమిటి? ఒకవేళ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టొదంటే అదే విషయం ప్రతిపక్షాలు స్పష్టంగా చెప్పాలి,” అని అన్నారు.


Related Post