షర్మిల ఓదార్పు యాత్రలు ఫలిస్తాయా?

July 27, 2021


img

వైఎస్సార్‌ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నల్గొండ జిల్లా, చందూర్ మండలంలోని పుల్లెమ్ల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ముందుగా ఆమె ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ తరువాత వేదిక వద్ద ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నిరాహార దీక్ష ప్రారంభించారు. 

తెలంగాణ ప్రభుత్వం 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశలో ఒక్క అడుగు ముందుకుపడలేదని వైఎస్ షర్మిల విమర్శించారు, కనీసం ఇప్పటికైనా నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్ షర్మిల రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించానని స్వయంగా చెప్పుకొన్నారు. అధికారం కోసం పాదయాత్రాలు, ఓదార్పుయాత్రలు ఆమె తండ్రి స్వర్గీయ రాజశేఖర్‌, సోదరుడు జగన్‌మోహన్ రెడ్డే ప్రారంభించారు. కనుక ఆమె కూడా వారి బాటలోనే సాగుతున్నట్లు భావించవచ్చు. 

పాదయాత్రతో ఆమె తండ్రి, ఓదార్పు యాత్రలతో జగన్‌ ముఖ్యమంత్రి కావాలనే తన కలను నెరవేర్చుకోగలిగారు. అయితే అప్పటి రాజకీయ, భౌగోళిక పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. తెలంగాణలో టిఆర్ఎస్‌ తిరుగులేకుండా ఉంది. దాని ధాటికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు సైతం అల్లాడిపోతున్నాయి. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళయినా నేటికీ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. 

ఈ పరిస్థితులలో జగన్ ‘ఓదార్పు యాత్ర’ ఫార్ములా ఇక్కడ తెలంగాణలో ఫలిస్తుందనుకోలేము. ఆమె తన దీక్షలలో సిఎం కేసీఆర్‌ను, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నప్పటికీ ఆమె పార్టీ ఎన్నికలలో ఓట్లు చీల్చి టిఆర్ఎస్‌ పార్టీకే మేలుచేయగలరు. ఒకవేళ ఆమె అదే ఉద్దేశ్యంతో రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించినట్లయితే నూటికి నూరు శాతం ఆమె ప్రయత్నాలు టిఆర్ఎస్‌కు ఉపకరిస్తాయి కానీ అధికారం కోసమే ఈ దీక్షలు, ఓదార్పు యాత్రలు చేస్తున్నట్లయితే వాటితో ఆమె ఎన్నడూ ఆ లక్ష్యం సాధించలేరనే చెప్పవచ్చు. 


Related Post