దళిత బంధుపై అత్యుత్సాహం...బెడిసికొడితే?

July 27, 2021


img

దళిత బంధు పధకంపై జరుగుతున్న హడావుడిని చూస్తుంటే ఈ విషయంలో టిఆర్ఎస్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందనిపిస్తుంది. ఈ పధకంతో రాష్ట్రంలో దళితుల జీవితాలలో వెలుగులు నింపాలనుకోవడాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయి కానీ సిఎం కేసీఆర్‌ చిత్తశుద్ధినే శంకిస్తున్నాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు హడావుడిగా ప్రకటించి ఆ నియోజకవర్గంలోనే దీనిని ప్రారంభించాలనుకోవడమే ఇందుకు ఒక కారణం కాగా గతంలో నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి ఇచ్చిన ఎన్నికల హామీలనే ఇంతవరకు అమలుచేయనప్పుడు లక్షల కోట్లు అవసరంపడే ఈ పధకాన్ని ప్రకటించడం వారి విమర్శలు, అనుమానాలకు మరో కారణంగా కనిపిస్తోంది. 

అయితే సిఎం కేసీఆర్‌ వాటన్నిటినీ తేలికగా కొట్టిపడేస్తూ ఈ పధకాన్ని గట్టిగా సమర్ధించుకొంటున్నారు. దీనిని ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే వీలైనంత ఎక్కువ ప్రచారం వచ్చేలా చేయడంలో సఫలం అయ్యారు కూడా. ఈ పధకంపై రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చలు జరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనిని హుజూరాబాద్‌ ఉపఎన్నికలో విజయం సాధించడం కోసమే ప్రకటించారా లేక నిజంగా దళితుల జీవితాలను ఉద్దరించడానికే తెచ్చారా?అనేది పక్కన పెడితే, ఇప్పుడు దీనిపై ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, దీని గురించి చేసుకొంటున్న ప్రచారం వలన టిఆర్ఎస్‌కు దీర్గకాలంలో లాభం జరుగుతుందా లేక నష్టపోతుందా?అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. 

ఎందుకంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరుద్యోగభృతి, దళితులకు మూడెకరాల భూమి, పంటరుణాల మాఫీ వంటి హామీల గురించి టిఆర్ఎస్‌ గట్టిగా ప్రచారం చేసుకొని ముందుగానే వాటి క్రెడిట్ ఓట్ల రూపంలో తీసేసుకొంది కానీ ఇంతవరకు అవి అమలవకపోవడంతో నిత్యం విమర్శలను ఎదుర్కోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లు దళిత బంధు పధకం గురించి ఇంత గొప్పగా చెప్పుకొని ప్రచారం చేసుకొన్నాక దానిని అమలుచేయలేకపోతే టిఆర్ఎస్‌పై ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా సిఎం కేసీఆర్‌ విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. 

పైగా దీనికి కనీసం లక్ష కోట్లు అవసరమని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.2.5 లక్షల కోట్లయితే ఈ ఒక్క పధకానికే లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? తేలేకపోతే దానిని ఎలా అమలుచేస్తారు?ఇన్ని గొప్పలు చెప్పుకొని చివరికి చేయలేకపోతే టిఆర్ఎస్‌ పరిస్థితి ఏమిటి?

రాష్ట్రంలో దళితులకు మాత్రమే రూ.10 లక్షలు చొప్పున పంచిపెడితే మిగిలినవాళ్ళు ఓటర్లు కారా?వాళ్ళకీ రూ.10 లక్షల చొప్పున డబ్బు పంచండంటూ బిజెపి నేత విజయశాంతి డిమాండ్ చేయడం మరో పెద్ద ప్రమాద ఘంటికగా భావించవచ్చు. రాష్ట్రంలో మిగిలిన వర్గాల ప్రజలలో దీనిపై అసంతృప్తి మొదలైతే ఏమవుతుంది?అని ఆలోచిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయని అర్ధం అవుతోంది. 

కనుక ఈ పధకం విజయవంతంగా అమలైనా కాకపోయినా దీని ప్రభావం టిఆర్ఎస్‌పై తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇది కేవలం హుజూరాబాద్‌ ఉపఎన్నికకే పరిమితం కాబోదు వచ్చే శాసనసభ ఎన్నికలపై కూడా దీని విపరీత ప్రభావం తప్పక ఉంటుందని చెప్పవచ్చు. 

కనుక ఈ పధకాన్ని విజయవంతంగా అమలుచేయగలిగితే టిఆర్ఎస్‌ తప్పకుండా రాజకీయంగా లబ్ధి పొందుతుంది కానీ ఏ కారణంగానైనా అమలుచేయలేకపోతే దీనిపై ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం, చేసుకొంటున్న ప్రచారంతో తాత్కాలిక లబ్ధి (హుజూరాబాద్‌లో) పొందగలదేమో కానీ భవిష్యత్‌లో దానికే చాలా సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.


Related Post