హుజూరాబాద్‌ దళిత ప్రతినిధులతో సిఎం కేసీఆర్‌ 8 గంటలు సమావేశం!

July 27, 2021


img

తెలంగాణ దళిత బంధు పధకాన్ని సిఎం కేసీఆర్‌ త్వరలోనే హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నందున దాని గురించి వివరించేందుకు ఆ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల నేతలు, ప్రతినిధులు, కార్యకర్తలను సోమవారం ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 16 బస్సులలో మొత్తం 450 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ముందుగా సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత హుజూరాబాద్‌ నుంచి వచ్చిన దళిత ప్రతినిధులతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్గంగా కొనసాగిన ఈ సమావేశంలో సిఎం కేసీఆర్‌, సంబంధిత అధికారులు వారికి దళిత బంధు పధకం గురించి వివరించారు. సిఎం కేసీఆర్‌ మధ్యాహ్నం వారందరితో కలిసి విందుభోజనం చేశారు. 

దళిత బంధు పధకం ప్రవేశపెట్టడానికి గల కారణాలు, పరిస్థితులు, ఈ పధకం యొక్క ఆశయాలు, దాని అమలు కోసం చేస్తునా ఏర్పాట్లు, దానితో కల్పించనున్న దళిత భీమా వంటి ఇతర ప్రయోజనాలు, అంతిమంగా ఈ పధకం నుంచి ఆశిస్తున్న ఫలితాలు తదితర అంశాలపై సిఎం కేసీఆర్‌ సుదీర్గంగా వారికి వివరించారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ పధకంతో రాష్ట్రంలో దళితుల జీవితాలలో వెలుగులు నిండుతాయని, దీంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తుందని సిఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.


Related Post