ఈటల ఎఫెక్ట్: బిజెపికి పెద్దిరెడ్డి గుడ్ బై

July 26, 2021


img

మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నేత ఐనుగాల పెద్దిరెడ్డి సోమవారం సాయంత్రం పార్టీకి రాజీనామా చేశారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా రాష్ట్ర బిజెపి నేతలు ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి తోడ్కొనిపోయి పార్టీ కండువా కప్పించడం సరికాదని అప్పుడే పెద్దిరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకంటే ఈటల రాజేందర్‌ వలననే పార్టీకి ఎక్కువ లబ్ది కలుగుతుందని భావిస్తున్నందునే తనతో సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి తీసుకువచ్చారని పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత కొంచెం సర్దుకొని హుజూరాబాద్‌ టికెట్ తనకు కేటాయిస్తే ఉపఎన్నికలో పోటీ చేస్తానని అన్నారు. కానీ ఆయన అసంతృప్తిని, ప్రతిపాదనను పార్టీలో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యి చివరికి బిజెపికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో మారిన రాజకీయ పరిస్థితులలో బిజెపిలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదు. అందుకే పార్టీని వీడుతున్నాను,” అని అన్నారు.

ప్రతీపార్టీకి బలోపేతం చేసుకోవడం చాలా అవసరమే. అందుకు ఇతర పార్టీల ముఖ్య నేతలను ఆకర్షించి పార్టీలో చేర్చుకోవడం రాజకీయాలలో చాలాకాలంగా నడుస్తున్న ట్రెండ్. కొత్త నాయకులను తెచ్చుకోవడమే ముఖ్యం తప్ప పాతకాపులను నిలబెట్టుకోవడం అవసరమని భావిస్తున్నట్లు లేదు. అందుకే ఈటల రాజేందర్‌ కోసం పెద్దిరెడ్డిని బిజెపి వదులుకోవడానికి సిద్దపడిందనుకోవచ్చు. అయితే ఒక బలమైన నేత కోసం మరో బలమైన నేతను వదులుకోవడం వలన పార్టీకి లాభామా...నష్టమా? అని ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు.


Related Post