నన్ను వివాదాలలోకి లాగితే ప్రమాదం: ప్రవీణ్ కుమార్‌

July 26, 2021


img

తెలంగాణ దళిత, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేసి, ఇంకా ఆరేళ్ళు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “ నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. దేనికీ మద్దతు ఇవ్వడం లేదు. కానీ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. దానిని నేను ఖండిస్తున్నాను. దయచేసి నన్ను ఎవరూ వివాదాలలోకి లాగొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను లేకుంటే అంచనాలు తల్లక్రిందులవుతాయి. నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వెదజల్లే డబ్బును వాటి కోసం ఖర్చుపెడితే సద్వినియోగం అవుతుంది,” అని అన్నారు. 

అయితే అంచనాలు తల్లక్రిందులవడమంటే దేని గురించో ఆయన వివరించలేదు. అయితే ఈసారి ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య హోరాహోరీ పోరాటం జరుగబోతున్నందున బడుగుబలహీనవర్గాలలో మంచి ఆదరణ కలిగిన ఆయన ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆయన దళిత బంధు పధకంతో దళితులకు ఒరిగేదేమీ ఉండదని...అది ఉపఎన్నికలో లబ్ది కోసం ప్రవేశపెట్టినదేనని అన్నారు కనుక ఆయన ఉపఎన్నిక సందర్భంగా దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే టిఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. దాంతో టిఆర్ఎస్‌ నష్టపోవచ్చు. అంచనాలు తలక్రిందులవడం అంటే బహుశః ఆయన ఉద్దేశ్యం అదే అయ్యుండవచ్చు. కనుక ఆయన టిఆర్ఎస్‌ నేతలను ఉద్దేశించే ఈవిదంగా అని ఉండవచ్చు.


Related Post