ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: ఉత్తమ్‌కుమార్ రెడ్డి

July 26, 2021


img

పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, “వచ్చే శాసనసభ ఎన్నికలలో నేను మళ్ళీ హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసమే సిఎం కేసీఆర్‌ దళిత బంధు పధకాన్ని హడావుడిగా ప్రకటించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ వంటివి అమలుచేయని సిఎం కేసీఆర్‌ దళితబంధు పధకం అమలుచేస్తారంటే ఎలా నమ్మగలం? ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఉపఎన్నికకు ముందే హుజూరాబాద్‌లో దళితులందరికీ దళిత బంధు పధకం కింద సొమ్ము పంపిణీ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా దానిని అమలుచేయడం కోసం రూ.1.5 లక్షల కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోంది. దీనికోసం ఇంటలిజన్స్ ఐజి ప్రభాకర్ రావును సిఎం కేసీఆర్‌ వినియోగించుకొంటున్నారు. అయితే ఎల్లకాలం ఒకే పార్టీ అధికారంలో ఉండబోదని గుర్తుంచుకొని అధికారులు నిష్పక్షపాతంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తే మంచిది లేకుంటే తరువాత వారే ఇబ్బందుల్లో పడతారు,” అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.    

ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బలమైన కారణం ఏదీ లేకుండానే తన ఎమ్మెల్యే పదవిని వదులుకొన్నారు. తన స్థానంలో భార్య పద్మావతిని నిలబెట్టినప్పటికీ ఆమె స్వల్ప తేడాతో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి చేతిలో ఓడిపోయారు. దాంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌ టిఆర్ఎస్‌ వశమైంది. కానీ ఇంతవరకు తన ఎమ్మెల్యే పదవిని ఎందుకు వదులుకొన్నారో ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పనేలేదు. బహుశః శాసనసభలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను, మంత్రులను, సిఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారడంతో 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి లోక్‌సభకు వెళ్ళిపోయారనుకోవాలేమో? 

అంటే ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించిన హుజూర్‌నగర్‌ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోలేదు. ఆ స్థానాన్ని చేజేతులా టిఆర్ఎస్‌కు అప్పగించడం ద్వారా పార్టీకి నష్టం కలిగించినట్లు భావించవచ్చు. మరి అటువంటప్పుడు మళ్ళీ హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనుకొంటున్నారు?అనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుదామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి భావిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. 


Related Post