టిఆర్ఎస్‌కు కొత్త తలనొప్పులు

July 26, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఇప్పటికే ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం...వారి పార్టీల నుంచి పోటీ ఎదుర్కోవలసివస్తున్న టిఆర్ఎస్‌కు మరికొన్ని కొత్త తలనొప్పులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని సిఎం కేసీఆర్‌ గత ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ అది ఇంతవరకు నెరవేర్చకపోవడంతో వారు ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. కనుక ఈ ఉపఎన్నికలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి 500 మంది అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించేందుకు సిద్దం అవుతోంది. ఉపఎన్నికలోగా సిఎం కేసీఆర్‌ రూ.1,000 కోట్లు మూలధనంతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే తాము నామినేషన్లు వేయడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. 

ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాల పెంపుతో సహా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కనుక తమ నిరసన తెలియజేసేందుకు ఉపఎన్నికలో 1,000 మంది నామినేషన్లు వేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

ఒకవేళ ఈ రెండు వర్గాలలో ఏ ఒక్కటి లేదా రెండూ నామినేషన్లు వేసినా ఉపఎన్నికలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలో సుమారు 140 మంది పసుపు రైతులు నామినేషన్లు వేయడం సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటమికి కారణాలలో ఒకటని అందరికీ తెల్సిందే. కనుక ఈ ఉపఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టిఆర్ఎస్‌ ముందుగా ఈ రెండు వర్గాలను బుజ్జగించవలసి ఉంటుంది. 


Related Post