ఈటల చిన్నవాడైతే...రఘునందన్ రావు ప్రశ్న

July 26, 2021


img

ఈటల రాజీనామాతో వస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నికను కూడా టిఆర్ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రత్యర్ధులు కూడా ఆ స్థాయిలోనే దాంతో యుద్ధానికి సిద్దమయ్యారు. దీంతో మళ్ళీ మూడు ప్రధాన పార్టీలకు ఇది మరో అగ్నిపరీక్షగా మారింది.

మొన్న సిఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ఓ టిఆర్ఎస్‌ నేతతో ఫోన్లో “ఈటల రాజేందర్‌ చాలా చిన్నవాడు...అతనిని మనం పట్టించుకోనవసరం లేదు. ఉపఎన్నికలో మనమే గెలుస్తాం...” అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో నిన్న జరిగిన చర్చా కార్యక్రమంలో దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, టిఆర్ఎస్‌ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వారి మద్య ఇదే విషయంపై చాలా ఆసక్తికర వాగ్వాదం జరిగింది.

రఘునందన్ రావు మాట్లాడుతూ, “ఈటల చిన్నవాడైతే ఈ ఉపఎన్నిక గురించి సిఎం కేసీఆర్‌ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు?స్వయంగా హుజూరాబాద్‌ నేతలతో మంతనాలు చేస్తూ ఎందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2018 ఎన్నికలప్పుడు ఇచ్చిన నిరుద్యోగభృతి హామీని ఇంతవరకు అమలుచేయని సిఎం కేసీఆర్‌, ఇప్పుడు హడావిడిగా మరో కొత్త పధకం దళిత బంధును ఎందుకు ప్రకటించారు?దానిని హుజూరాబాద్‌లోనే ఎందుకు ప్రారంభిస్తున్నారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

వాటికి జీవన్ రెడ్డి అంతే ధీటుగా సమాధానం ఇస్తూ,“ తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 100కు పైగా పధకాలను ప్రారంభించాము. వాటిని వేర్వేరు జిల్లాలలో ప్రారంభించాము. ఇదీ అంతే. ఈ పధకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా వ్రాసి ఉందా?ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు, విమర్శలు చేస్తే మేము తప్పకుండా వాటిని స్వీకరిస్తాం కానీ ప్రభుత్వం ఏమి చేయాలో...ఎప్పుడు, ఎలా చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఉపఎన్నిక ఇంకా ఎప్పుడు జరుగుతుందో తెలియనప్పుడు ఈ పధకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభిస్తే బిజెపికి అభ్యంతరం ఏమిటి?హుజూరాబాద్‌ ప్రజలు ఏం పాపం చేశారని ఈ పధకాన్ని అక్కడ ప్రారంభించకూడదు?” అని ఎదురుప్రశ్నలు వేశారు. 

ఆ తరువాత వారి చర్చ పక్కదారి పట్టి ఎన్నికల హామీలను అమలుచేయనందుకు ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌లను ప్రాసిక్యూట్ చేయాలంటూ ముగిసింది. అది వేరే సంగతి. కానీ హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సంబందించినంతవరకు ఇరువురి వాదనలు హేతుబద్దంగానే ఉన్నాయని అర్ధమవుతోంది. కనుక హుజూరాబాద్‌ ప్రజలే విచక్షణతో నిర్ణయించుకొని ఓట్లు వేయాల్సి ఉంటుంది.


Related Post