దళిత బంధుకు లక్ష కోట్లు ఖర్చు పెడతాం: కేసీఆర్‌

July 24, 2021


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న దళితబంధు పధకంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతుంటే, సిఎం కేసీఆర్‌ ఇది ఎన్నికల కోసం కాదని, దళిత బంధు పధకాన్ని విజయవంతంగా అమలుచేసి చూపిస్తానని గట్టిగా చెపుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించినందుకు హుజూరాబాద్‌కు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు శనివారం ప్రగతి భవన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మేము ఏ పధకం ప్రకటించినా దానిపై అవాకులు చవాకులు వాగేవాళ్ళు చాలా మందే ఉంటారు. దళితబంధు పధకం గురించి చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. కానీ ఈ పధకాన్ని విజయవంతంగా అమలుచేసి యావత్ దేశానికి, ప్రపంచానికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతాను. దీని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. కనుక దీనిని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దాము. హుజూరాబాద్‌లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించుకొని దాని స్పూర్తితో రాష్ట్రమంతటా దశలవారీగా అమలుచేసుకొందాము. గట్టిగా పట్టుపడితే ఏదైనా సాధ్యమే. ఇదీ అంతే. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి ఈ పధకం చేరేలా చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది,” అని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు రూ.80,000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెపుతోంది. కానీ దళిత బంధు పధకానికే లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం కేసీఆర్‌ చెపుతుండటం చాలా ఆసక్తికరంగా ఉంది.  రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంటోంది. ఇప్పుడు దళితబంధుని దశలవారీగా అమలుచేస్తామని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు కనుక రాబోయే శాసనసభ ఎన్నికలలోగా ఏడాదికి కనీసం రూ.30,000 కోట్లు ఈ పధకం కోసమే ప్రత్యేకంగా కేటాయించవలసి ఉంటుంది. ఓ పక్క రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని రూ.2,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం కోసం కోకాపేట భూములను అమ్ముకొన్నప్పుడు, ఏడాదికి 30 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుందేమో చూద్దాం.


Related Post