కేసీఆర్‌ కంటే ముందే జాతీయ రాజకీయాలలోకి మమతా బెనర్జీ

July 24, 2021


img

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తానంటూ హడావుడి చేస్తుంటారు కానీ ఇంతవరకు ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హటాత్తుగా జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం ఆమెను పార్లమెంటరీ పార్టీ కమిటీ ఛైర్ పర్సన్‌గా ఎన్నుకొన్నారు. మర్నాడే అంటే...ఇవాళ్ళ ఆమె ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. 

కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ ఒక్కత్రాటిపైకి తెచ్చి దేశానికి మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారని తృణమూల్ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు. దేశంలో బడుగుబలహీనవర్గాల ప్రజలకు ఆమె ఆశాజ్యోతి అని అన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కరోనా రెండో దశ కట్టడిలో కేంద్రప్రభుత్వం వైఫల్యాలు, ఇంకా జాతీయస్థాయిలో ఇతర సమస్యలపై కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, అందుకు ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని సుఖేందు శేఖర్ రాయ్ కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికలలోగా జాతీయస్థాయిలో బిజెపియేతర పార్టీల మద్య సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చేందుకు మమతా బెనర్జీ కృషి చేస్తారని సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు. ఇకపై ఆమె జాతీయరాజకీయాలకు సమయం కేటాయించి పనిచేస్తారని సుఖేందు శేఖర్ రాయ్ తెలిపారు. 

మమతా బెనర్జీ నిర్ణయం వెనుక చాలా బలమైన కారణమే ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆమె పార్టీని ఓడించి అధికారం చేజిక్కించుకోవడం కోసం బిజెపి విశ్వప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె ముఖ్య అనుచరులను, పార్టీ ముఖ్య నేతలను బిజెపిలోకి తీసుకుపోయారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలిద్దరూ కుట్రలు పన్నుతున్నారని మమతా బెనర్జీ పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో తన పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు మోడీ, అమిత్ షాలు ప్రయత్నిస్తున్నందున, మమతా బెనర్జీ ఢిల్లీలో వారి ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకోవడం సహజమే. కానీ ఆమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిందే. 


Related Post