సిఎం కేసీఆర్‌కు మరో రాజకీయ శత్రువు!

July 24, 2021


img

సిఎం కేసీఆర్‌కు ఇప్పటికే రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న వంటి పలువురు బలమైన రాజకీయ శత్రువులున్నారు. వారి జాబితాలో కొత్తగా మరో వ్యక్తి చేరారు. ఆయనే...ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్.ప్రవీణ్ కుమార్‌! 

ఇంకా ఆరేళ్ళ సర్వీసు ఉండగానే ఆయన మొన్న తన ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ తరపున పోటీ చేసేందుకే సిఎం కేసీఆర్‌ సూచన మేరకు ఆయన రాజీనామా చేశారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఆయన దళితుల పట్ల సిఎం కేసీఆర్‌ వైఖరి, విధానాలు నచ్చకనే రాజీనామా చేసి బయటకు వచ్చినట్లు దళిత బంధు పధకం గురించి ఆయన మాట్లాడిన మాటలలోనే అర్ధం అవుతోంది. 

శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో స్వేరోస్ జిల్లా సమావేశానికి హాజరైన ఆయన, వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసమే దళిత బంధు పధకం ప్రకటించారని నేను భావిస్తున్నాను. దాంతో దళితులను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. నిజానికి ఆ పధకానికి కేటాయించే డబ్బును గురుకుల పాఠశాలలకు కేటాయిస్తే రాష్ట్రంలో ఎంతోమంది దళిత విద్యార్దుల జీవితాలు మారిపోతాయి. వారు కూడా విదేశాలకు వెళ్ళి ఉన్నతవిద్యలు చదువుకోగలుగుతారు. వారిలో నుంచి ఓ సుందర్ పిచ్చాయ్... ఓ సత్యా నాదెళ్ళ లాంటి గొప్ప వ్యక్తులు ఉద్భవిస్తారు. దాంతో దళితులు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదుగగలుగుతారు. కానీ ఉపఎన్నికలో ఓట్లు దండుకోవడం కోసమే ప్రవేశపెట్టిన ఈ పధకం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. 

ఎన్నికలొచ్చినప్పుడల్లా ఇటువంటి ఆకర్షణీయమైన పధకాలు ప్రకటించడం, ఓటుకు రెండు వేలు, ఐదు వేలు చొప్పున పంచిపెడుతుంటడటం, బీరు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ప్రలోభపెట్టి మన ఓట్లు గుంజుకొంటున్నారు. మాయ మాటలతో మనల్ని అయోమయానికి గురిచేస్తూ మన ఎదగకుండా చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం బాంచెన్ నీ కాల్మోక్తా అంటాము? ఇంకా ఎంతకాలం గొర్రెలు, మేకలు కాస్తూ జీవితాలు వెళ్లదీస్తాము? ఇంకా ఎంతకాలం గుడిసెల్లో బతుకుతూ ఇళ్ళలో పాచి పనులు చేసుకొంటూ సేవకుల్లా బతుకుతాము?

ఎన్నికలోస్తే తల నరుకొనే వాళ్ళు, కాల్మొక్కేవాళ్ళు వచ్చి నాలుగు మాయమాటలు చెప్పి బీర్లు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే మాట ఇచ్చామని వారికే ఓట్లేస్తూ ఉందామా?ప్రభుత్వంలో 29 మంది బీసీ, ఎస్సీ, ఎస్స్టీలకు చెందిన ఎమ్మెల్యేలునప్పటికీ ఎవరూ మన పరిస్థితుల గురించి, మనకు జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. అందుకే రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలందరికీ సమాన గౌరవం, ప్రాధాన్యం సాధించేందుకే నేను నా పదవికి రాజీనామా చేసి పోరాటానికి సిద్దమయ్యాను. నేను రాజీనామా చేసిన మర్నాడే నాపై పోలీస్ కేసు నమోదు చేశారు. పోలీస్ కేసులకు భయపడేవాడిని కాను నేను. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడేందుకు నేను సిద్దపడే వచ్చాను,” అని అన్నారు.


Related Post