మంత్రి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

July 24, 2021


img

తెలంగాణ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు నేడు. సిఎం కేసీఆర్‌ కుమారుడిగా రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభాపాఠవాలతో, నాయకత్వ లక్షణాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం సంపాదించుకొన్నారు. రాష్ట్ర రాజకీయాలలో, ప్రభుత్వంలో, టిఆర్ఎస్‌ పార్టీలో సిఎం కేసీఆర్‌ తరువాత అంతా గొప్ప పేరు, పట్టు సాదించుకొన్న ఏకైక వ్యక్తి కేటీఆర్‌ అని అందరికీ తెలుసు. 

రాజకీయాలలోకి రాకమునుపు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండటం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల కలిగి ఉండటంతో రాష్ట్రంలో పారిశ్రామిక, ఐ‌టి, మౌలికవసతుల అభివృద్ధికి కాలం చెల్లిన చట్టాలలో స్పీడ్ బ్రేకర్లుగా నిలుస్తున్న నియమనిబందనలను తొలగించి సరికొత్త విధానాలు రూపొందించారు. దీంతో రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం మొదలై అనేక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి. 

ఇదివరకు రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ నగరంలో మాత్రమే ఐ‌టి కంపెనీలుండేవి కానీ ఇప్పుడు పలు జిల్లా కేంద్రాలలో ఐ‌టి కంపెనీలు ఏర్పాటయ్యేలా చేస్తూ స్థానికయువతకు అక్కడే ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలలో ఐ‌టి హబ్స్, టెక్స్‌టైల్‌ పార్క్‌, ఫార్మా పార్క్‌, చిన్న, మద్య స్థాయి పరిశ్రమల పార్క్‌లను ఏర్పాటు చేయిస్తున్నారు.

అలాగే పురపాలకశాఖ చట్టాలను కూడా సమూలంగా ప్రక్షాళన చేసి రాష్ట్రంలో నిర్మాణరంగాన్ని కూడా పరుగులు తీయిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌కు ధీటుగా అన్ని జిల్లాలలో మౌలికవసతులు, మినీ ట్యాంక్ బండ్‌లు, పార్కులు, వైకుంఠధామాలు వగైరా   ఏర్పడేందుకు మంత్రి కేటీఆర్‌ చొరవ, కృషి కారణమని అందరికీ తెలుసు. 

సిరిసిల్లా చేనేత, మగ్గం కార్మికులను ఆదుకోవడం కోసమే ప్రత్యేకంగా బతుకమ్మ చీరల పధకాన్ని ప్రవేశపెట్టారు. దాంతో ఇప్పుడు వారి జీవితాలు కాస్త సుఖంగా సాగిపోతున్నాయి. చాలా దూరదృష్టి అన్నిటికీ మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల కలిగిన కేటీఆర్‌ కీలక మంత్రి పదవులు చేపట్టడం వలననే ఇవన్నీ సాధ్యం అయ్యాయని చెప్పవచ్చు. 

రాజకీయాలలో అపర చాణక్యుడని పేరొందిన సిఎం కేసీఆర్‌ శిక్షణలో కేటీఆర్‌ ఆరితేరారని చెప్పవచ్చు. టిఆర్ఎస్‌ ప్రభుత్వ, పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంలో, తమ రాజకీయ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కోవడంలో కేటీఆర్‌ది ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. తండ్రిలాగే చెప్పవలసిన విషయాన్ని చాలా సరళమైన భాషలో సామాన్యప్రజలకు సైతం అర్దమయ్యేలా చెపుతుంటారని ప్రశంశలు కురుస్తుంటాయి. అలాగే రాజకీయాలలో హుందాతనం పాటించేవ్యక్తిగా కూడా మంచి పేరు సంపాదించుకొన్నారు. అలాగే ప్రజల సమస్యలపై మానవత్వంతో ఆయన స్పందించే తీరుపట్ల కూడా ప్రశంశలు కురుస్తుంటాయి.  

మంచి పరిపాలనా సమర్ధత, చక్కటి నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోగల గుణం, దూరదృష్టి, అన్నిటికీ మిచి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల, తపన కేటీఆర్‌ను వర్తమాన రాజకీయాలలో నవతరం నాయకుడిగా ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి. పుట్టిన రోజు సందర్భంగా మై.తెలంగాణ.కామ్ ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 


Related Post