బిజెపికి మోత్కుపల్లి గుడ్ బై

July 23, 2021


img

మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం బిజెపికి రాజీనామా చేశారు. తనను బిజెపిలో చేర్చుకొనేవరకు రాష్ట్ర బిజెపి నేతలు తన చుట్టూ తిరిగారని కానీ పార్టీలో చేరాక తనను పట్టించుకొనేవారే లేరని, రాజకీయాలలో అత్యంత సీనియర్‌ అయిన తనకు పార్టీలో సముచిత గౌరవం లభించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేరుకొంటున్నట్లు తనతో మాట మాత్రంగానైనా చెప్పకపోవడం తనను చాలా బాధించిందని అన్నారు. ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి తాను హాజరవడాన్ని బిజెపిలో క్ందరు నేతలు తప్పు పట్టడాన్ని ఆయన ఖండించారు. సిఎం కేసీఆర్‌ ఒక మంచి ఆలోచనతో ప్రతిపక్ష నేతలను సమావేశానికి ఆహ్వానిస్తే దానికి హాజరవడం ధర్మం అని అన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు ముందుగా తెలియజేసి తాను ఆ సమావేశానికి హాజరయ్యానని అన్నారు. 

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి సిఎం కేసీఆర్‌ అద్భుతంగా కృషి చేస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ప్రశంశించారు. సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో టిఆర్ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. అందుకే టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని చాలా కాలం క్రితమే చెప్పానని కానీ అప్పుడు చంద్రబాబునాయుడు తన మాటలను తప్పుగా అర్ధం చేసుకొన్నారని అన్నారు. కానీ చివరికి తాను చెప్పినట్లుగానే టిడిపి ఇప్పుడు టిఆర్ఎస్‌లో విలీనం అయ్యిందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. 

మోత్కుపల్లి నర్సింహులు టిడిపి నుంచి బహిష్కరింపబడిన తరువాత టిఆర్ఎస్‌లోకి వెళ్దామనుకొన్నారు కానీ ఆహ్వానం రాకపోవడంతో నిరాశ చెందారు. బహుశః ఇప్పుడు ఆహ్వానం వచ్చినందునే ఆయన ఈవిదంగా మాట్లాడుతున్నారేమో? త్వరలోనే ఆ విషయమూ తేలిపోతుంది. 


Related Post