ఈటల అలా ఎందుకున్నారో...ఎందుకంటున్నారో?

July 23, 2021


img

ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌ను వీడిన తరువాత తాను ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని, టిఆర్ఎస్‌లో అందరూ బానిస బతుకులు బతుకుతున్నారని పదేపదే చెపుతున్నారు. నిన్న ఇల్లందకుంట మండలంలో ప్రజాదీవెన యాత్రలో కూడా బానిస బతుకు నుంచి తాను విముక్తి పొందానని అన్నారు. 

అయితే ఆయన పదేపదే ఈ మాటలు ఎందుకు నొక్కి చెపుతున్నారు? టిఆర్ఎస్‌లో ఉండటమంటే బానిస బతుకని ఆయన భావిస్తున్నారు కనుక మంత్రి పదవి కోసమే ఆయన ఏడేళ్ళపాటు ఆ ‘బానిస బతుకు’ను అంగీకరించారనుకోవచ్చు. అదే...మంత్రిపదవి కంటే ఆత్మగౌరవమే ముఖ్యమనుకొంటే ఆయన ఎప్పుడో బయటకు వచ్చి ఉండాలి. కానీ మంత్రి పదవి ఊడినందునే తప్పనిసరి పరిస్థితులలో ఆయన బయటకు వచ్చారు తప్ప ఆయనంతట ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి రాలేదనే సంగతి అందరికీ తెలుసు. ఈ విషయం ప్రజలకు తెలియదనుకోలేము. తెలియనివారికి టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు ఎలాగూ తెలియజేస్తున్నారు.  

ఈటలకు టిఆర్ఎస్‌ నేతలు కూడా ధీటుగానే బదులిస్తున్నారు. ప్రభుత్వంలో సిఎం కేసీఆర్‌ తరువాత రెండో స్థానంలో ఈటల రాజేందర్‌కు గౌరవం, ప్రాధాన్యం పొందేవారని, అయినా ఇంకా ఏదో తక్కువైనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఏ సమావేశం జరిగినా సిఎం కేసీఆర్‌ పక్కనే ఈటల కూర్చోండేవారు. అదే ఓ ప్రత్యక్ష నిదర్శనం అనుకోవచ్చు. రెండుసార్లు కూడా చాలా కీలకమైన ఆర్ధిక, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలను ఈటలకు ఇవ్వడం మరో నిదర్శనంగా టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. కానీ ఈటల తన పదవీ, అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను కబ్జా చేయడంతో సిఎం కేసీఆర్‌ ఆయనపై వేటు వేశారని లేకుంటే ఈటలకు ఇటువంటి దుస్థితే వచ్చి ఉండేది కాదని వాదిస్తున్నారు. ఇది ఈటల స్వయంకృతాపరాదమే కనుక ఆయన సిఎం కేసీఆర్‌ను వేలెత్తి చూపడానికే లేదంటున్నారు.

కానీ ఈటల పదేపదే ఆత్మగౌరవం, బానిస బతుకులు అని ఎందుకు నొక్కి చెపుతున్నారంటే, బహుశః తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు ఆపాదించి వారిని తనవైపు తిప్పుకోవడానికి, టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలను మానసికంగా దెబ్బ తీయడానికని భావించవచ్చు.


Related Post