టాలీవుడ్‌లో లుకలుకలకు అద్దం పడుతున్న మా ఎన్నికలు

July 22, 2021


img

తెలుగు సినీ పరిశ్రమపైకి మహాద్బుతంగా కనిపిస్తుంటుంది కానీ తెర వెనుక అందరూ ఏవిదంగా కీచులాడుకొంటున్నారో...ఒకరినొకరు ఎంతగా అసహ్యించుకొంటున్నారో ‘మా’ ఎన్నికల పర్వం కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల యుద్ధంలో ప్రకాష్ రాజ్‌, జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. పోటీ పడటంలో తప్పు లేదు కానీ ఎన్నికల పేరుతో ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం, ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపుకొని వ్యక్తిగతంగా దెబ్బతీసుకోవడం, ముఠాలు కట్టడం చూస్తుంటే వీరి కంటే రాజకీయ నాయకులే నయమనిపించకమానదు. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు మాటలే ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.

“మాలో కొందరు జైల్లో ఊచలు లెక్కపెట్టవలసినవారు దర్జాగా బయట తిరుగుతున్నారు. దానికి కారణం ఎవరో వాళ్ళనే అడగాలి. పోలీస్‌స్టేషన్‌లో రాత్రంత్రా అండర్‌వేర్‌తో కూర్చోబెడితే సినీ పరిశ్రమ పరువుపోతుందని వారిని తెల్లవారుజామున గుట్టుగా బయటకు తీసుకువచ్చిన సందర్భాలున్నాయి. కనుక ఎవరైనా శృతి మించి మాట్లాడితే వారి పేర్లు, బండారం అంతా బయటపెడతాను,” అంటూ మంచు విష్ణు హెచ్చరించారు.         

మా ఎన్నికల కోసం ఇంత రాద్ధాంతం అవసరమా? సినీ పరిశ్రమలో అనేకమంది పెద్దలున్నప్పుడు మా ఈ గొడవలు, విమర్శలు, ఆరోపణలు, బెదిరింపులతో తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ట ఇంకా మసకబారుతుందని తెలిసినా ఎందుకు కలుగజేసుకోవడం లేదు?మా ఎన్నికలు సజావుగా ఎందుకు నిర్వహించలేకపోతున్నారు?మా సభ్యులే తెలుగు సినీ పరిశ్రమ పరువు బజారుకీడ్చుతుంటే సినీ పెద్దల మౌనానికి అర్ధం ఏమిటి?


Related Post