రూ.15,000 కోట్లతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్‌

July 22, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో నెలకు కనీసం ఒకటి రెండు భారీ పెట్టుబడులు వస్తుండటం సర్వసాధారణమైంది. దీనిని బట్టి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను రప్పించడానికి ఎంతగా కృషి చేస్తోందో అర్ధం అవుతుంది.   

తాజాగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడితో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీనిపై ప్రభుత్వం ఆ సంస్థ ప్రతినిధులతో జరుపుతున్న చర్చలు దాదాపు కొలిక్కివచ్చాయి. డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కూడా కేటాయించినట్లు సమాచారం. కనుక చర్చలు పూర్తయితే త్వరలోనే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్‌ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

మైక్రోసాఫ్ట్ కంపెనీ భారత్‌లోని రిలయన్స్ జియో కంపెనీతో కలిసి క్లౌడ్ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు సొంతంగా భారీ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దేశంలో తమ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను విస్తరించుకోవాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు, కార్యాలయాలు ఉన్నాయి. అమెజాన్ సంస్థ కూడా హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడితో అమెజాన్ వెబ్‌సర్వీసస్‌ పేరిట డాటా సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. త్వరలో అమెరికా, కెనడా దేశాలకు చెందిన డిజిటల్ రియాల్టీ, బ్రూక్ ఫీల్డ్ కంపెనీలు కలిసి ‘బీఏఏం డిజిటల్ రియాల్టీ’ అనే పేరుతో హైదరాబాద్‌లో ఓ భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇవన్నీ తరలివస్తే భారత్‌కు హైదరాబాద్‌ నగరం డాటా కేంద్రంగా మారుతుంది. 


Related Post