చైనాను నిందించి మనమేం చేస్తున్నాము ఇప్పుడు?

July 21, 2021


img

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. భారత్‌లో మొన్నటి వరకు 30,000 దిగువకు వచ్చిన కరోనా కేసులు మళ్ళీ నిన్న ఒక్కరోజే 40,015కి పెరిగాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా మళ్ళీ భారీగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 3,998 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,07,170 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో రికవరీ రేటు 97.36 శాతం వద్ద నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 41.51 కోట్ల మంది వాక్సిన్లు వేయించుకొన్నారు.  

మళ్ళీ పెరుగుతున్న కేసులు దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు. దాదాపు అన్ని రాష్ట్రాలలో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, పండుగల సీజన్ మొదలవడం, చాలా మంది టీకాలు వేయించుకొన్నామనే ధైర్యంతో ఏమాత్రం కరోనా జాగ్రత్తలు పాటించకుండా యధేచ్చగా తిరుగుతుండటమే దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈవిదంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా థర్డ్ వేవ్ తప్పదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘తాంబూలాలు ఇచ్చేశాము ఇక తన్నుకు చావండి...’ అన్నట్లు కరోనా హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నాయే తప్ప ప్రజలందరూ ఖచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించేలా చేయడం లేదు. అటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు ప్రజలూ పట్టించుకోకపోవడంతో మళ్ళీ కరోనా కేసులు పెరగడం మొదలైందని చెప్పవచ్చు. కరోనా థర్డ్ వేవ్ ఆగస్ట్ మూడవ వారం నుంచి మొదలవవచ్చునని నిపుణులు అంచనా వేశారు. కానీ ఈ లెక్కన ఆగస్ట్ మొదటివారం నుంచే కరోనా థర్డ్ వేవ్ మొదలైనా ఆశ్చర్యం లేదు.

కరోనాకు చైనా కారణమని అందరం నిందిస్తుంటాం కానీ ఇప్పుడు మనం చేస్తున్నదేమిటి? అని ఎవరూ ఆలోచించడం లేదు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. కరోనా జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతూ దేశంలో కరోనా థర్డ్ వేవ్‌ను మనమే స్వయంగా తెచ్చుకొంటున్నాము కదా?


Related Post