ఏ పార్టీలో చేరను: ప్రవీణ్ కుమార్‌

July 21, 2021


img

తెలంగాణ దళిత, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఇంకా ఆరేళ్ళు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించింది. మంగళవారం నుంచే ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఆయన  స్థానంలో ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్‌ను కార్యదర్శిగా నియమించింది. 

ప్రవీణ్ కుమార్‌ను టిఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకొని హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేయించేందుకు సిఎం కేసీఆర్‌ సూచన మేరకు ఆయన రాజీనామా చేశారని వెలువడుతున్న వార్తలపై ఆయన స్పందిస్తూ, “నాకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదు. నేను ఏ పార్టీలోను చేరబోవడం లేదు. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి వెళ్ళి బడుగుబలహీన వర్గాల ప్రజలను కలుస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను నా పదవికి రాజీనామా చేశాను. డాక్టర్ అంబేడ్కర్, జ్యోతీరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనుకొంటున్నాను,” అని అన్నారు.

ఆయన నిజంగా ఈ మాటలకు కట్టుబడి ఉంటారో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ప్రజలకు, ముఖ్యంగా... బడుగు బలహీనవర్గాలకు సేవ చేయాలనుకొంటే పదవి, అధికారం చాలా అవసరం. అప్పుడే వారికి వీలైనంత ఎక్కువ సాయం చేయగలుగుతారు. సమాజాసేవ చేసే చాలామంది ఇదే కారణంతో రాజకీయాలలో ప్రవేశించి, పదవీ, అధికారం కోసం ప్రయత్నిస్తుండటం అందరికీ తెలిసిందే. కానీ ప్రవీణ్ కుమార్‌ కీలకమైన పదవిలో ఉంటూ బడుగుబలహీనవర్గాలకు ప్రభుత్వం తరపున వీలైనంత ఎక్కువ సహాయసహకారాలు అందించే అవకాశాన్ని వదులుకొని బయటకువచ్చి సేవ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదనే చెప్పాలి. ఒకవేళ ఆయన టిఆర్ఎస్‌లో చేరేందుకే రాజీనామా చేసి ఉంటే అప్పుడు తప్పుపట్టలేము. ఎందుకంటే ఓ అధికారిగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే బడుగుబలహీన వర్గాలవారికి మరింత ఎక్కువ సేవ చేయగలుగుతారు.


Related Post