ఉపఎన్నిక పుణ్యమాని... ఓ పాఠకుడి స్పందన

July 20, 2021


img

ఈటల రాజేందర్‌ రాజీనామాతో జరుగబోతున్న ఉపఎన్నికపై మూడు ప్రధాన పార్టీలు తీవ్ర ఆందోళన చెందుతున్నప్పటికీ, ఉపఎన్నిక పుణ్యమాని నియోజకవర్గంలో హడావిడిగా మొదలైన అభివృద్ధి పనులు, నియోజకవర్గంపై కుండపోతగా కురుస్తున్న వరాలజల్లులతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. నియోజకవర్గంలో ప్రజలే కాదు...ఇతర నియోజకవర్గాలలో ప్రజలు కూడా వారి అదృష్టాన్ని చూసి ‘మాకూ ఇటువంటి రోజు ఎప్పుడు వస్తుందో...మా నియోజకవర్గంలో ఉపఎన్నిక జరిగితే ఎంత బాగుండునో...’ అని అనుకొంటున్నారంటే అతిశయోక్తి కాదు.

‘ఈటల ఆరోపణలు సానుభూతి కోసమేనా?’ అనే శీర్షికతో ప్రచురితమైన కధనానికి ఓ పాఠకుడి స్పందన చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. చామకూరి సైదులు అనే ఓ పాఠకుడు, ఈ కధనంపై ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ, “ఈటెల రాజేందర్ పుణ్యమాని హుజురాబాద్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. అయన రాజీనామాతో ప్రభుత్వం అక్కడి ప్రజలకు వరాలు గుప్పిస్తోంది. మా నియోజకవర్గంలో కూడా ఏ కారణంగానైనా ఉపఎన్నిక వస్తే మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కాకపోయినా కొందరికైనా ప్రభుత్వ ఫలాలు అందుతాయి...” అంటూ ఓ మెసేజ్ పెట్టారు. అంటే ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పధకాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం అవుతుంది. 

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అనేక సంక్షేమ పధకాలు కూడా అమలవుతున్నాయి. కానీ జరుగవలసింది ఇంకా చాలా ఉంది. నేటికీ నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కనుకనే ఈవిధంగా కోరుకొంటున్నారని చెప్పవచ్చు. 

సాధారణ సమయంలో జరిగే అభివృద్ధి, అమలయ్యే సంక్షేమ పధకాల కంటే ఎన్నికలప్పుడు జరిగేవాటికి, అమలయ్యే వాటికి లెక్క వేరేగా ఉంటుందని హుజూరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒక్కో దళిత కుటుంబంపై పది లక్షలు చొప్పున కురిపించబోతున్న దళిత బంధు పధకం వంటివి చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఉపఎన్నిక జరగాలని కోరుకోవడం కంటే రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఇంతే చురుకుగా అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలుచేయాలని కోరుకొందాం.


Related Post