ఈటల నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి

July 20, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈసారి హత్యల ప్రస్తావన వినిపిస్తుండటం ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ‘కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని’ ఈటల రాజేందర్‌ ఆరోపించగా, ‘2018లో ఈటల రాజేందర్‌ తనను కమలాపూర్‌లో హత్య చేయించబోతే తప్పించుకొన్నానని’ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 

ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “బుదవారం మధ్యాహ్నం నేను సిఎం కేసీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నాను. సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలను చూసి ఆకర్షితుడినై టిఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నాను. 

ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నంతకాలం తన ఆస్తులు, పలుకుబడి పెంచుకొనేందుకే ప్రయత్నించారు తప్ప తన నియోజకవర్గం అభివృద్ధి గురించి అసలు పట్టించుకోలేదు. ఆయనది ఆత్మగౌరవ పోరాటం కాదు ఆస్తుల కోసం పోరాటం. త్వరలో జరుగబోయే ఉపఎన్నిక హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవానికి సంబందించినది కనుక నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడిన టిఆర్ఎస్‌కే ప్రజలు ఓట్లు గెలిపిస్తారని భావిస్తున్నాను. ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు, కాంగ్రెస్‌ అభ్యర్ధికి డిపాజిట్లు కూడా రాకపోవచ్చు. 

హత్యారాజకీయాల గురించి మాట్లాడుతున్న ఈటల రాజేందరే 2018 ఎన్నికల సమయంలో నన్ను హత్య చేయించబోయారు. కానీ అదృష్టం కొద్దీ తప్పించుకోగలిగాను. కనుక హత్యారాజకీయాలు చేసే అలవాటు ఆయనకే ఉంది. 

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నన్ను తమ్ముడూ అని పిలిస్తూ అన్నివిధాలా వాడుకొన్నారు. ఆ విషయం ఆయనకే తెలుసు. ఆయనది హడావుడే తప్ప దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రయోజనమూ ఉండబోదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కితే అదృష్టమే,” అని కౌశిక్ రెడ్డి అన్నారు. 


Related Post