ఈటల ఆరోపణలు సానుభూతి కోసమేనా?

July 20, 2021


img

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి తనను హత్య చేయించేందుకు కిరాయిగుండాలతో మంతనాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆ ఆరోపణలను వెంటనే ఖండించడమే కాకుండా కావాలనుకొంటే సిబిఐ చేత దర్యాప్తు చేయించుకోవచ్చునని ప్రతి సవాల్ విసిరారు. 

సాధారణంగా రాజకీయ పార్టీలు, వాటి నేతలు తమ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తాయే తప్ప హత్యలు చేసి కేసులలో ఇరుక్కోవాలనుకోవు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కె.జానారెడ్డిని ఓడించడానికి టిఆర్ఎస్‌ అనుసరించిన వ్యూహం గమనిస్తే ఈ విషయం అర్దమవుతుంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కూడా టిఆర్ఎస్‌కు చాలా ప్రతిష్టాత్మకమైనదే కానీ అందుకు ఇటువంటి నీచమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ఆ పార్టీకి...నేతలకు లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలిచినా, ఓడిపోయినా దానికి కొత్తగా వచ్చే లాభం, నష్టం ఏమీ ఉండవు. కానీ ఈ ఉపఎన్నిక ఈటల రాజేందర్‌కు చాలా కీలకమైనది. దీనిలో ఆయన ఓడిపోతే భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఆయనను బయటకు పంపివేయడం సరైనదేనని, హుజూరాబాద్‌ ప్రజలు ఆయన వాదనలను నమ్మడం లేదని స్పష్టం అవుతుంది. మంత్రివర్గం నుంచి అవమానకరంగా తొలగించబడినందుకుగాను ప్రజల సానుభూతి పొందుతున్న ఆయన మరింత సానుభూతి పొందేందుకే బహుశః తనపై హత్యాప్రయత్నం జరుగుతోందని చెప్పుకొని ఉండవచ్చు. తనపై హత్యాయత్నం జరుగుతున్నట్లు సమాచారం ఉందని ఆయన చెపుతున్నప్పుడు మంత్రి గంగుల కమలాకర్ సూచించినట్లుగా కేంద్రహోంమంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ఫిర్యాదు చేసి సిబిఐ చేత దర్యాప్తు చేయించుకోవచ్చు కదా? సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్‌ ఇటువంటి చవుకబారు ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకోవాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.


Related Post