కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్‌ గ్రీన్‌ సిగ్నల్‌...కానీ

July 20, 2021


img

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన హుజూరాబాద్‌ పార్టీ ఇన్‌-ఛార్జ్ కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆయన తన అనుచరులతో కలిసి బుదవారం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని టిఆర్ఎస్‌లో చేరనున్నారు.

అయితే ‘హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తనకు టిఆర్ఎస్‌ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటూ’ చెప్పిన ఫోన్‌ సంభాషణ లీక్ అయినందున, టిఆర్ఎస్‌ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. కనుక ఒకవేళ ఆయనకు టికెట్ కేటాయిస్తే టిఆర్ఎస్‌ పార్టీ ప్రతిపక్ష నేతలను ఈవిదంగా ప్రలోభాలతో లొంగదీసుకొంటోందనే ఆరోపణలను స్వయంగా దృవీకరించినట్లవుతుంది. కనుక ఆయనకు టికెట్ కేటాయింపుపై టిఆర్ఎస్‌ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

కౌశిక్ రెడ్డికి బదులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శిగా పనిచేసి బడుగుబలహీనవర్గాల అభిమానాన్ని పొందిన ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌ను హుజూరాబాద్‌ ఉపఎన్నిక బరిలో దించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆరేళ్ళు సర్వీసు ఉండగానే ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఆయన ఖండించినప్పటికీ రాజకీయ ప్రవేశం, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రవీణ్ కుమార్‌ చెప్పడం గమనిస్తే టిఆర్ఎస్‌లో చేరడం, ఉపఎన్నికలో పోటీ చేయడం కూడా ఖాయమేనని స్పష్టం అవుతోంది.

ఒకవేళ ఆయనకే టికెట్ ఇచ్చి బరిలో దింపుతున్నట్లయితే మరి కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏమిటి? టిఆర్ఎస్‌లో ఇంకా చేరక మునుపే ఈవిషయం తెలిసింది కనుక ఆ ఆలోచన విరమించుకొని వేరే పార్టీ తరపున లేదా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారా? రేపటిలోగా తెలియవచ్చు.


Related Post