గ్రేటర్‌లో 10 వేలు...హుజూరాబాద్‌లో 10 లక్షలు!

July 19, 2021


img

రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, బహుమతులు పంచిపెడుతుండటం అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి మరికొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. యావత్ ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది, అధికారులు అందరూ అధికార పార్టీ చేతిలోనే ఉంటారు. అంతేకాదు...అధికారంలో ఉంటే ఎన్నికలకు ముందు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు, ఉద్యోగ ప్రకటనలు, తాయిలాలు ప్రకటించవచ్చు. కావాలనుకొంటే వాటిని అమలుచేయవచ్చు లేదా తమను గెలిపిస్తే అమలుచేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది.  

ఉదాహరణకు గ్రేటర్ ఎన్నికల ముందు హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున కోట్ల రూపాయలు పంచిపెట్టింది. అది వరద బాధిత సహాయమే కానీ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిందేనని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలు ముగియగానే ఆ ఆర్ధిక సాయం నిలిపివేసిన సంగతి అందరికీ తెలుసిందే. 

మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చి పడింది. దీంతో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ అక్కడే కూర్చొని శరవేగంగా అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. ఈ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం కూడా మళ్ళీ 50,000 ఉద్యోగాల భర్తీ హడావుడి మొదలుపెట్టిందని భావించవచ్చు. అలాగే తెల్ల రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు మంజూరు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. తాజాగా ప్రకటించిన దళిత బందు పధకాన్ని సిఎం కేసీఆర్‌ మొట్ట మొదట హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే ప్రారంభించనున్నారు. 

ఉపఎన్నికలో ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రెండు మూడు వేలు చొప్పున పంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ఇవ్వబోతోంది. అప్పుడు ఓటర్లు ఏ పార్టీకి ఓట్లు వేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసమే సిఎం కేసీఆర్‌ హడావిడిగా దళిత బంధు పధకం ప్రకటించారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండానే ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పధకం అమలుకు రూ.1,500-2,000 కోట్లు ఇస్తామని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారని, ఆ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో దళితులకు ఇదే లెక్కన పంచిపెడతారా? అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకువస్తారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తయిన తరువాత ఈ పధకం అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు.  

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కీలకమైన హుజూరాబాద్‌ మండలంలో 5,323, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లంతకుంటలో 2,586 కుటుంబాలకు చెందిన సుమారు 70,000 మంది దళితులున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే అన్ని ఓట్లు టిఆర్ఎస్‌ ఖాతాలో పడిపోయినట్లే భావించవచ్చు. కనుక సిఎం కేసీఆర్‌ ఈటల రాజేందర్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై దళిత బంధు అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించినట్లు చెప్పుకోవచ్చు. బహుశః ఉపఎన్నిక గంట మ్రోగేలోగానే ఉద్యోగాల నోటిఫికేషన్‌ కూడా వెలువడవచ్చు. కనుక టిఆర్ఎస్‌ సంధిస్తున్న ఈ అస్త్రాలను ప్రతిపక్షాలు ఏవిదంగా ఎదుర్కొంటాయో చూడాలి.


Related Post