అయితే ఈటల పోటీ చేయడం లేదా?

July 19, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక గంట ఇంకా మ్రోగలేదు కానీ ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే అక్కడ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అప్పటి నుంచే టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు-ఈటల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి....ఆ తరువాత మెల్లగా ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. 

ఈసారి పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌ పార్టీకి ఈటల రాజేందర్‌కు మద్య ఉంటుందని వేరేగా చెప్పక్కరలేదు కానీ ఉపఎన్నికలో ఆయన పోటీ చేస్తారా లేదా?అనే ప్రశ్న మొదటే తలెత్తడం విశేషం. ఈటల సతీమణి జమున నిన్న హుజూరాబాద్‌ పట్టణంలో ఇంటింటికీ వెళ్ళి భర్త తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తారనే ఓ విలేఖరి ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ, “దీనిపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఉపఎన్నికలో నేను పోటీ చేసినా ఆయన పోటీ చేసినా ఒక్కటే. పార్టీ ఎవరిని పోటీ చేయమని ఆదేశిస్తే వాళ్ళు పోటీ చేస్తారు,” అని జవాబిచ్చారు.      

ఏ ఎన్నికలలోనైనా ఎవరు పోటీ చేయాలో పార్టీలే నిర్ణయిస్తాయనేది వాస్తవం. అయితే ఈటల రాజీనామాతో ఈ ఉపఎన్నిక జరుగబోతోంది...అదీగాక తనకు జరిగిన అవమానానికి ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడించి సిఎం కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకొంటానని ఈటల శపధం కూడా చేశారు. కనుక ఆయనే పోటీ చేస్తారని భావించడం సహజం. 

అయితే అపార రాజకీయ అనుభవం, అంగబలం, అర్ధబలం, ఇప్పుడు బిజెపి అందండలు కూడా కలిగిన ఈటల రాజేందర్‌ను నాగార్జునసాగర్ ఉపఎన్నికలోలాగే రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తిని నిలబెట్టి ఓడించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక చేజేతులా అటువంటి దుస్థితి తెచ్చుకోవద్దని ఒకవేళ ఈటల భావిస్తున్నట్లయితే ఆయన వెనక్కు తగ్గి తన సతీమణి జమునను లేదా బిజెపి ఎంపిక చేసిన అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు గట్టి ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ వారు ఓడినా ఈటల ఓటమి అవమానం నుంచి తప్పించుకోగలుగుతారు.


Related Post