త్వరలో సిఎం కేసీఆర్‌ మళ్ళీ జిల్లాల పర్యటనలు

July 19, 2021


img

సిఎం కేసీఆర్‌ త్వరలో మళ్ళీ జిల్లాల పర్యటనలకు బయలుదేరనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన తరువాత బిజెపి ఒక్కటే టిఆర్ఎస్‌కు రాజకీయ శత్రువుగా ఉండేది. కానీ ఇప్పుడు బిజెపి..దాని అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్‌ ఎదుర్కోవలసివస్తోంది. రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌, తీన్మార్ మల్లన్న, వైఎస్ షర్మిల పాదయాత్రలకు సిద్దం అవుతున్నారు. వారు నేరుగా ప్రజల మద్యకు వెళ్ళి సిఎం కేసీఆర్‌ వైఖరి, టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై చేసే తీవ్ర విమర్శలు, ఆరోపణలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. మరోపక్క మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేస్తున్న తీవ్ర విమర్శలు ఆరోపణలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి.  

అయితే “సిఎం కేసీఆర్‌ గట్టిగా నాలుగు జిల్లాల పర్యటనలు చేసి మాట్లాడితే ప్రతిపక్షాల నోళ్ళు మూతపడతాయని” కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ అన్నారు. కనుక సిఎం కేసీఆర్‌ పర్యటనలు అందుకేనని అర్ధమవుతోంది. 

వివిద జిల్లాలలో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల నిర్మాణపనులు వివిద దశలలో ఉన్నాయి. వాటిలో నిజామాబాద్‌, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఈ నెలాఖరుకు మరికొన్ని వచ్చే నెలలో పూర్తవుతాయి. కనుక వాటిని ప్రారంభించడానికి సిఎం కేసీఆర్‌ ఆయా జిల్లాలలో పర్యటించనున్నారు. 

ఇవి కాక ములుగు, కరీంనగర్‌, నారాయనపేట జిల్లా కలెక్టరేట్ల నిర్మాణపనులకు ఇటీవలే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కనుక వాటికి శంఖుస్థాపన కార్యక్రమాలకు సిఎం కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. ఈలోగా హుజూరాబాద్ ఉపఎన్నికకు గంట మ్రోగవచ్చు కనుక సిఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు, ఆ సందర్భంగా ఆయన ప్రకటించే వరాలు ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు మేలు చేకూర్చుతాయని వేరే చెప్పక్కరలేదు. 

త్వరలోనే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ కార్యాలయాల నిర్మాణపనుల పురోగతిపై జిల్లా నేతలతో సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనల షెడ్యూల్ ఖరారు కావచ్చు.


Related Post