ఉపఎన్నిక ప్రచారానికి టిఆర్ఎస్‌ విద్యార్ధి సంఘం!

July 18, 2021


img

టిఆర్ఎస్‌ అనుబంద విద్యార్ధి సంఘం ‘టిఆర్ఎస్‌వి’ అధ్వర్యంలో తెలంగాణ విద్యార్ధి జేఏసీకి చెందిన ఏడు విద్యార్ధి బృందాలు నేటి నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌, గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తరువాత బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు టిఆర్ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు జి. శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు నియోజకవర్గంలో 5 మండలాలు, 2 మున్సిపాలిటీలలో పర్యటిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రజావ్యతిరేక విధానాల వలన కలుగుతున్న నష్టాల గురించి విద్యార్దులు, యువతకు వివరించడానికే బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పారు. 

ఈసారి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బిజెపిల నుంచి టిఆర్ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతునందునే టిఆర్ఎస్‌విని కూడా రంగంలో దింపుతున్నట్లు భావించవచ్చు. ఒకవేళ వారు నిజంగా కేంద్రప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాల గురించి యువతకు వివరించాలనుకొంటే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలి కానీ వారు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే బస్సు యాత్ర చేస్తుండటం టిఆర్ఎస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కోసమేనని అర్ధమవుతోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో యువ ఓటర్ల ఓట్లు చాలా కీలకం కానున్నాయి కనుక టిఆర్ఎస్‌విని బరిలో దించినట్లు భావించవచ్చు. ఇదివరకు జరిగిన ఏ ఎన్నికలలోనూ టిఆర్ఎస్‌విని బరిలో దించలేదు కానీ ఇప్పుడు దించుతోందంటే ఈ ఉపఎన్నిక పట్ల టిఆర్ఎస్‌ అధిష్టానం ఎంత ఆందోళనతో అర్ధం చేసుకోవచ్చు. 


Related Post