నేను పార్టీలో ఉన్నానో లేదో నాకే తెలీదు: డిఎస్

July 17, 2021


img

ఒకప్పుడు రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్‌) చాలా కాలంగా టిఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ బిజెపిలో ఎంపీగా ఉండగా, మరో కుమారుడు ధర్మపురి సంజయ్ ఇటీవల పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. దీనిపై ఆయన స్పందన తెలుసుకొనేందుకు విలేఖరులు ఆయనను కలువగా ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలీదు. కనుక నేను టిఆర్ఎస్‌ పార్టీలో ఉన్నానా లేదా అనే విషయం మీరు నన్ను అడిగే బదులు కేసీఆర్‌నే అడిగి తెలుసుకొంటే మంచిది. నా ఇద్దరు కొడుకులు రెండు వేర్వేరు పార్టీలలో ఉండటాన్ని నేను తప్పుగా భావించడం లేదు. ఇప్పుడు చాలా కుటుంబాలలో వ్యక్తులు ఇలాగే వేర్వేరు పార్టీలలో ఉంటున్నారు. వారిద్దరి లక్ష్యం ప్రజాసేవే కానీ దానికి వారు ఎంచుకొన్న దారులు వేరు. వారు ఏ పార్టీలలో ఉన్నప్పటికీ వారిద్దరూ నాకు రెండు కళ్ళలాంటివారు. నా భవిష్య కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తా,” అని అన్నారు. 

ధర్మపురి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, కనుక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలం క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా జిల్లా టిఆర్ఎస్‌ నేతలు సిఎం కేసీఆర్‌కు ఓ లేఖ వ్రాశారు. దాంతో ఆయన సిఎం కేసీఆర్‌ను కలిసి సంజాయిషీ ఇచ్చుకోవాలనుకొన్నారు కానీ ఆయనకు కేసీఆర్‌ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయనంతట ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతారని టిఆర్ఎస్‌, పార్టీ బహిష్కరిస్తే వెళ్ళిపోదామని ఆయన ఎదురుచూస్తున్నారు. కనుక ఇప్పుడు ఆయన టిఆర్ఎస్‌లో ఉన్నట్లా లేనట్లా అనేది ఆయనకు కూడా తెలీదనే భావించవచ్చు.


Related Post