ఉద్యోగాల భర్తీకి ఇంత జాప్యం ఎందుకంటే...

July 16, 2021


img

నీళ్ళు, నిధులు, నియమకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కారణంతో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకొన్నారు. కనుక ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ ప్రకటించాలని టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గత ఏడేళ్ళుగా కోరుతున్నారు కానీ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు. 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ ఇంతవరకు నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఇంకా ఎప్పుడు విడుదలవుతుందో తెలీని పరిస్థితి. ఉద్యోగాల భర్తీకే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం ఇక జాబ్‌ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తుందో? 

అసలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోంది? అనే ప్రశ్నకు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. మంత్రి తలసాని చెప్పినట్లు ఉద్యోగాల భర్తీ వలన ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరగడం. 2. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీని కూడా ఎన్నికలతో ముడిపెట్టి లబ్ది పొందాలనుకోవడం. 3. నోటిఫికేషన్‌ మొదలు భర్తీ వరకు ప్రతీ దశలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతుండటం.  

ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా క్యాలెండర్ రూపొందించాలను కోవడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని, దాంతో ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వంపై ఆర్ధికభారం మరింత పెరుగుతుంది కనుకనే నోటిఫికేషన్‌ నుంచి భర్తీ వరకు ఈ ప్రక్రియను వీలైనంత వరకు సాగదీస్తూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందనే విషయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలతో అర్ధమవుతోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో సమయంలో టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు ఉద్యోగాల నోటిఫికేషన్‌, భర్తీ గురించి గట్టిగా మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకోవాలని తాపత్రయపడటం అందరూ కళ్ళారా చూశారు. మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముంచుకొస్తోంది కనుకనే టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రస్తావన చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుక 50,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇప్పుడు మొదలుపెట్టి 2023 శాసనసభ ఎన్నికల వరకు సాగదీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Related Post