తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్‌ రెడ్డి వార్నింగ్

July 16, 2021


img

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. మరికొద్ది సేపటిలో వారు రాజ్‌భవన్‌ వరకు పాదయాత్ర చేసి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడానికి సిద్దంగా ఉన్నారు. కానీ పోలీసులు వారి ర్యాలీకి అనుమతి నిరాకరించడమే కాకుండా ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“పార్టీ పిలుపు మేరకు మేము శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు ర్యాలీ చేయాలనుకొంటే పోలీసులు ఎందుకు అడ్డుకొంటున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేసేందుకు మాకు హక్కు ఉంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని అందుకు మేమే బాధ్యతవహిస్తామని చెపుతున్నా పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకొంటున్నారు?ఇప్పటికే అరెస్ట్ చేసిన, గృహనిర్బందంలో ఉంచిన మా పార్టీ నేతలను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం తీరు మారకుంటే లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి రావలసివస్తుంది,” అని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి, తెలంగాణ జనసమితి పార్టీలు ఎప్పుడు సభలు, ర్యాలీలు నిర్వహించుకోవాలన్నా పోలీసులు అనుమతించరు కానీ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలను మాత్రం అనుమతిస్తుంటారు ఎందుకు? 

దశాబ్ధాల పాటు ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. మరి అటువంటప్పుడు ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజాసమస్యలపై కనీసం నిరసన వ్యక్తం చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించదా?ఎందుకు? అనుమతిస్తే అనుమతిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి?యావత్ దేశ ప్రజలు పెరుగుతున్న పెట్రోల్, డీజీల ధరల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కనుక ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవలసిన అవసరం ఏమిటి? అంటే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును టిఆర్ఎస్‌...ప్రభుత్వం సమర్ధిస్తున్నాయా?


Related Post