కాంగ్రెస్‌ ఓడిపోతుందని రేవంత్‌ రెడ్డే అంటే ఎలా? కౌశిక్ రెడ్డి

July 14, 2021


img

తనకు టిఆర్ఎస్‌ టికెట్ ఖాయం అయ్యిందంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఫోన్‌ సంభాషణపై రేగిన దుమారం ఇంకా చల్లారాక మునుపే మళ్ళీ ఆయన కొత్తపల్లి కాంగ్రెస్‌ కార్యకర్త మేకల తిరుపతితో ఫోన్‌లో మాట్లాడిన మాటలు కూడా మీడియాకు లీక్ అయ్యాయి. అయితే ఈసారి దానిలో కౌశిక్ రెడ్డి పార్టీ తీరుపట్ల, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్న మాటలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. 

ఆయన మాటల సారాంశం ఏమిటంటే, “అవతల ఈటల రాజేందర్‌ చాలా బలమైనోడు మనం అతనిని ఓడించడం చాలా కష్టం. ఉపఎన్నికలో మనం (కాంగ్రెస్‌) గెలవలేమని సాక్షాత్ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డే అంటే ఎలా?హుజూరాబాద్‌లో మనం గెలుస్తామో లేదో తరువాత సంగతి. ముందు పోటీకి సిద్దపడాలి కదా?కానీ ఎన్నికలకు ముందే పార్టీ అధ్యక్షుడు ఈవిదంగా మాట్లాడటం ఏం బాగుంది?పొన్నం ప్రభాకర్ కూడా కోవర్టులాగా వ్యవహరిస్తున్నాడు. హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌, బిజెపిలు ఇన్‌-ఛార్జీలను వేసుకొన్నారు. వాళ్ళు అప్పుడే తిరుగుతున్నారు. మనం కూడా వేసుకొందామని నేను రెండు నెల్ల నుంచి బ్రతిమాలుతున్నా పార్టీలో ఎవరూ పట్టించుకోలేదు... ఎవరూ రారు. ఈ లెక్కన పార్టీ ఉంటే మనం ఎలా పోరాడగలం? తిరుపతన్నా..దీనిపై నువ్వు కూడా ఆలోచించు. మనకి మంచి రోజులు వచ్చాయి. నువ్వు కూడా దీనిలో పాలుపంచుకోవాలని కోరుకొంటున్నాను. నీతో ఇంకా చాలా మాట్లాడేదుంది. ఇవాళ్ళ రాత్రికి వచ్చి నిన్ను కలుస్తాను.”  

మొదటి సంభాషణ లీక్ అయ్యి నష్టం కలిగించినప్పుడు, రెండోసారి మళ్ళీ అటువంటి పొరపాటు జరుగకుండా కౌశిక్ రెడ్డి జాగ్రత్తపడి ఉండాలి. కానీ మళ్ళీ ఆయన ఫోన్‌ సంభాషణ లీక్ అయ్యింది. రాజకీయాలలో ఉన్నవారికి ఇటువంటి పొరపాట్లు ఆత్మహత్యతో సమానంగా మారుతుంటాయి. మొదటి ఫోన్‌ సంభాషణ లీక్ అవడంతో కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై టిఆర్ఎస్‌ పునరాలోచనలో పడటమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక ఇకనైనా ఆయన జాగ్రత్త పడటం మంచిది లేకుంటే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post