వైఎస్ షర్మిల ఆరాటం ఆ క్రెడిట్ కోసమేనా?

July 14, 2021


img

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం వనపర్తి జిల్లాలో తాడిపర్తి గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి కొండల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత సాయంత్రం 6 గంటల వరకు తాడిపర్తిలో నిరాహారదీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యోగాల భర్తీ విషయంలో సిఎం కేసీఆర్‌ మాయమాటలతో మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికలలో టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన సిఎం కేసీఆర్‌ ఇంతవరకు ఆ హామీని ఎందుకు అమలుచేయలేదో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసేవరకు ఇకపై ప్రతీ మంగళవారం ఒక్కో జిల్లాలో నిరుద్యోగ దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల హెచ్చరించారు.  

తెలంగాణ ప్రభుత్వం 50,000 ఉద్యోగాల భర్తీ చేయడంలో చాలా ఆలస్యం చేసినమాట వాస్తవమే. అందుకు ప్రభుత్వం అనేక కారణాలు చెపుతోంది అది వేరే విషయం. అయితే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై లోతుగా చర్చించి కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం వీలైనంత త్వరగా50,000 ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించారు. కనుక త్వరలోనే టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం ఖాయమే అని భావించవచ్చు. 

ఈవిషయం గ్రహించి ఆ క్రెడిట్ దక్కించుకొనేందుకే వైఎస్ షర్మిల నిరాహారదీక్షలు చేస్తున్నారా?అనే సందేహం కలుగుతుంది. రేపు టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయగానే తన పోరాటాలకు ప్రభుత్వం తలొగ్గి నోటిఫికేషన్‌ జారీ చేసిందని వైఎస్ షర్మిల, ఆమె పార్టీ నేతలు చెప్పుకోకుండా ఉండరు.


Related Post