తెలంగాణలో సింగపూర్ హబ్‌ ఏర్పాటు: కేటీఆర్‌

July 14, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో సింగపూర్‌ కంపెనీల కోసమే ప్రత్యేకంగా 2,000 ఎకరాలలో ప్రత్యేకంగా పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు కాబోతోంది. భారత్‌లోని సింగపూర్ హైకమీషనర్ సైమన్ వాంగ్ నేతృత్వంలో అధికారుల బృందం నిన్న హైదరాబాద్‌ వచ్చి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యింది. 

రాష్ట్రంలో ఇప్పటికే సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు పరిశ్రమలు స్థాపించాయని, కొత్తగా వచ్చేవాటి కోసం రాష్ట్రంలో ఎంపిక చేసుకొన్న జిల్లాలో 2,000 ఎకరాలలో ప్రత్యేకంగా సింగపూర్ హబ్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వారికి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వివిద రాష్ట్రాల నుంచి, వివిద దేశాలకు చెందినపరిశ్రమలున్నాయని వాటిలో ఆయా రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్నవారు చాలా మంది ఉన్నారని, ఇది రాష్ట్రంలోని చక్కటి వ్యాపార, పారిశ్రామిక వాతావరణానికి అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐ‌టి, ఫార్మా, లైఫ్ సైన్సస్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, జౌళి, ఏరోనాటికల్, డిఫెన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. కనుక తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు విదేశాలతో కూడా పోటీ పడే స్థాయికి ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

వ్యాపార, పారిశ్రామిక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు, ప్రోత్సాహకాలు, వీటికి సంబందించి ప్రభుత్వ విధానాలపై సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సింగపూర్ కంపెనీల కోసం ప్రత్యేక హబ్‌ ఏర్పాటు చేస్తామనే  ప్రతిపాదనపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం పట్ల సింగపూర్ హైకమీషనర్ సైమన్ వాంగ్, బృందం చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తాము సింగపూర్‌ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తామని సింగపూర్ హైకమీషనర్ సైమన్ వాంగ్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. 


Related Post