నేడు కూడా కొనసాగనున్న మంత్రివర్గ సమావేశం

July 14, 2021


img

ఈసారి తెలంగాణ మంత్రివర్గ సమావేశం వరుసగా రెండో రోజులు సాగుతుండటం విశేషం. నిన్న ప్రగతి భవన్‌లో సుమారు ఏడు గంటల సేపు సుదీర్గంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో భూముల ధరల పెంపు, ఉద్యోగాల భర్తీపై లోతుగా చర్చ జరిగింది. నిన్నటి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ, భూముల ధరల పెంపు విషయంలో మరికొంత చర్చ అవసరమని భావించినట్లు తెలుస్తోంది. ఇవి కాక ఇంకా పలు అంశాలపై చర్చించాల్సి ఉన్నందున నేడు మరోసారి సమావేశం నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం నేడు కూడా కొనసాగుతున్నందున నిన్న జరిగిన సమావేశానికి సంబందించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.     

కానీ నిన్న జరిగిన సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నట్లు తెలుస్తోంది. 

• రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినందున ఇక నుంచి దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేయాలి. తద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయి కనుక జోనల్ వ్యవస్థను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.  

• వివిద ప్రభుత్వ శాఖలలో ప్రతీ ఏడాది ఖాళీ అయ్యే ఉద్యోగాలను అదే ఏడాదిలో భర్తీ చేయాలి. దీని కోసం ముందుగానే జాబ్‌ క్యాలెండర్ రూపొందించి ప్రకటించాలి.  

• టిఎస్‌పీఎస్సీపై భారం తగ్గించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తరహాలోనే నీటిపారుదల శాఖ, వైద్య శాఖ, గురుకులాలకు వేర్వేరుగా నియామక సంస్థలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలోనే ఎంపిక కమిటీలను ఏర్పాటు చేయాలి. 

విద్యా వ్యవస్థలో స్థానికత: ఇక నుంచి గురుకుల పాఠశాలలో 50 శాతం సీట్లు స్థానిక విద్యార్దులకే కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. గురుకుల పాఠశాలలో సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఇకపై ప్రతీ నెలకు ఒకసారి అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని, దానిలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలని నిర్ణయించారు.


Related Post