పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల పార్టీలో కొందరు సీనియర్లు తీవ్ర వ్యతిరేకత కనబరిచినప్పటికీ క్రమంగా పార్టీలో ఆయనకు మద్దతు పలికేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. టిఆర్ఎస్‌లో చేరబోతున్న కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పు పట్టారు. పార్టీలో అందరూ సోనియా గాంధీ నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేయరని అన్నారు. గత ఎన్నికలలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి కేవలం 61,121 ఓట్లు మాత్రమే పడ్డాయనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈసారి ఉపఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిల మద్య ఓట్లు చీలినా కూడా కాంగ్రెస్ పార్టీకి పడవలసిన ఓట్లన్నీ తప్పకుండా పడతాయని భట్టి విక్రమార్క అన్నారు.
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో ఎవరూ ఆయనకు మద్దతుగా లేదా వ్యతిరేకంగా మాట్లాడలేదనే చెప్పాలి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు చేసినప్పటికీ పిసిసి అధ్యక్ష పదవి దక్కలేదనే ఆవేదనతోనే ఏదో మాట్లాడాను తప్ప ఎవరినీ బాధ పెట్టాలని కాదని తరువాత సర్దిచెప్పుకొన్నారు. చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మల్లు రవి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్లు రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు వారి జాబితాలు భట్టి విక్రమార్క కూడా చేరారని చెప్పుకోవచ్చు.
పార్టీ లోపలే కాకుండా బయట నుంచి కూడా రేవంత్ రెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఆయన పార్టీ పగ్గాలు చేప్పటినందుకు నిజామాబాద్ మాజీ మేయర్, బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అలాగే మహబూబ్‌నగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాలపల్లిలో సీనియర్ బిజెపి నేత గండ్ర సత్యనారాయణ తదితరులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పార్టీలో చేరబోతున్నట్లు వారు తెలిపారు. ఈ పరిణామాలు రేవంత్ రెడ్డి వర్గానికి చాలా ఊరట కలిగించేవే అని వేరే చెప్పక్కరలేదు.