మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాలలో అభివృద్ధి కార్యమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆ స్థానంలోకి బిజెపి బలపడి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. నేను గతంలోను ఇదే మాట చెప్పాను. మళ్ళీ ఇప్పుడూ అదే చెపుతున్నాను. నాయకత్వ లోపం వలననే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. అందుకే నేను పార్టీ వీడాలని భావించాను. కానీ రాబోయే రోజుల్లో పార్టీ తీరుతెన్నులు, అది తీసుకొనే నిర్ణయాలను చూసిన తరువాత పార్టీలో కొనసాగాలా వద్దా...అనేది నిర్ణయిచుకొంటాను. కనుక ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ వీడాలనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి నియామకంపై ప్రస్తుతం నేనేమీ మాట్లాడదలచుకోలేదు,” అని అన్నారు.
పార్టీలో దశాబ్ధాలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఎందుకు కట్టబెట్టిందనేది కాలమే చెపుతుంది. ఆ ఒక్కటీ తప్ప కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ సముచిత ప్రాధాన్యత, గౌరవం లభిస్తూనే ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో విభేదించి దూరంగా ఉంటున్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం బిజెపిలో చేరేందుకు కూడా సిద్దపడ్డారు. కానీ ఎందుకో ఆగిపోయారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోలేదు. అది కోమటిరెడ్డి సోదరులపై గౌరవంతోనా లేదా రాజకీయ కారణాల చేతనా?అనేది వారికే తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి దానిని అలుసుగా భావిస్తున్నట్లున్నారు. తద్వారా ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ను కరుణించి వరం ప్రకటిస్తున్నట్లుంది.
ఒకవేళ పార్టీ పట్ల గౌరవం, నమ్మకం, కృతజ్ఞత ఉంటే ఈవిదంగా మాట్లాడకూడదు. పార్టీపై నమ్మకం లేనట్లయితే పార్టీ గుమ్మం పట్టుకొని ఇంకా వ్రేలాడకూడదు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందరినీ కలుపుకుపోవాలనే ప్రయట్నంలో ఇటువంటి మాటలను పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలను ఉపేక్షించే రకం కాదు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ టిఆర్ఎస్ నుంచి టికెట్ ఖరారు చేసుకొన్నట్లు తెలిసినప్పుడు ‘ఈ నెలాఖరులోగా పార్టీలో కోవర్టులందరూ వారంతట వారు బయటకు పోవాలని లేకుంటే చర్యలు తీసుకొంటానని’ కుండబద్దలు కొట్టినట్లు హెచ్చరించడమే ఆయన వైఖరిని తెలియజేస్తోంది. కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత త్వరగా తేల్చుకొంటే అంత మంచిదేమో?