రేవంత్‌ రెడ్డి అంత ధైర్యం చేయగలరా?

July 13, 2021


img

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్ కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్‌ కోవర్టుగా అభివర్ణించారు. పార్టీలో అటువంటి కోవర్టులు మరి కొంతమంది ఉన్నారని, వారందరికీ ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నానని, ఆ తరువాత వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్న కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకొంటానని అన్నారు. వారిని వేధిస్తున్న అధికారుల జాబితాను కూడా తయారుచేస్తున్నానని, 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత వారందరి భారతం పడతానని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కనుక ఇకనైనా అధికారులు కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడం, గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం తధ్యమని అన్నారు. ఆ జెండా నీడలోనే టిఆర్ఎస్‌ను సమాధి చేస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు, భావ ప్రకటన స్వేచ్చ, ప్రజాస్వామ్యం అడ్డుపెట్టుకొని పార్టీకి ఇబ్బంది లేదా నష్టం కలిగించేవారు చాలామందే ఉన్నారు. అయితే వారిలో కొందరు తమ అసంతృప్తిని ఆవిదంగా వెళ్ళగక్కుతుంటే కొందరు కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఆవిదంగా వ్యవహరిస్తుంటారు. కోవర్టులుగా ఉంటూ దెబ్బ తీయాలని చూసేవారి వలననే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. కానీ వారిని గుర్తించినప్పటికీ ఏరిపారేసే ధైర్యం ఎవరికీ లేదు. రేవంత్‌ రెడ్డి ఆ పని చేస్తానని అంటున్నారు. అది చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బాగుపడవచ్చు.


Related Post