తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఇవాళ్ళ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరిపోయారు. టిఆర్ఎస్ మంత్రులు, నేతలు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లాలో బీసీ నేతగా మంచి గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ బయటకు వెళ్ళిపోవడంతో ఆ లోటును భర్తీ చేసేందుకే సిఎం కేసీఆర్ ఎల్.రమణను పార్టీలో తీసుకొన్నారని టిఆర్ఎస్ నేతలు చెప్పుకొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలలో ఆయన చేత జోరుగా ప్రచారం చేయించడం ద్వారా బీసీ ఓట్లను టిఆర్ఎస్‌కు పడేలా చేయాలనేది టిఆర్ఎస్ వ్యూహమని వార్తలు వస్తున్నాయి.
కానీ ఈటల రాజేందర్‌తో పోలిస్తే ఎల్.రమణకు ప్రజాకర్షణ శక్తి చాలా తక్కువేనని అందరికీ తెలుసు. బహుశః ఇంతకాలం టిడిపిలో ఉండటం వల్లనే ఆయనను ప్రజలు పట్టించుకోలేదనుకొంటే, మరి ఇప్పుడు టిఆర్ఎస్‌లో చేరారు గనుక ఆయన పట్ల వారి అభిప్రాయాలు, ఆలోచనలు మారుతాయా? అంటే కాదనే అనిపిస్తుంది. కనుక ఉపఎన్నికలలో ఆయన ఏ మేరకు బీసీ ఓటర్లపై ప్రభావం చూపగలరు? తెలంగాణలో టిడిపిని కాపాడుకోలేకపోయిన ఆయన టిఆర్ఎస్‌లో హేమాహేమీలు చేయలేని ఏ పాత్ర పోషించగలరు? అని అప్పుడే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ అతి త్వరలోనే తప్పక సమాధానాలు లభిస్తాయి.