త్వరలోనే భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌: ఐఎంఏ

July 13, 2021


img

కరోనా సెకండ్ వేవ్‌ భారత్‌పై ఎంత తీవ్ర ప్రభావం చూపిందో అందరూ కళ్ళారా చూశారు. సెకండ్ వేవ్‌లో చాలా కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. అయినా ప్రజలలో ఎటువంటి మార్పు కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కరోనా తీవ్రత తగ్గగానే అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ సడలించడంతో ప్రజలు ఎటువంటి కరోనా జాగ్రత్తలు పాటించకుండా యధేచ్చగా బయట తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా మళ్ళీ ఉత్సవాలు, సామూహిక ప్రార్ధనలు, వేడుకలు, రాజకీయ సభలు వగైరా జరుగుతున్నాయి. మార్కెట్లు జనాలతో నిండిపోతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్‌ పూర్తిగా ముగియక మునుపే ప్రజలు యధేచ్చగా తిరుగుతుండటంతో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ తప్పక వస్తుందని, అది కూడా ఊహించిన దానికంటే ముందుగానే వస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.

ప్రజలు, ప్రభుత్వాలు కూడా కరోనా పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనికి అందరూ మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించింది. దేశంలో వాక్సినేషన్ పూర్తి కాకుండానే పర్యాటకం, తీర్ధయాత్రలు, సామూహిక ప్రార్ధనలు, ఉత్సవాలను అనుమతించడం సరికాదని, దీని వలన టీకాలు వేసుకోనివారి ద్వారా కరోనా మళ్ళీ అందరికీ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కనుక ఇకనైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నిటిపై కొన్ని నెలలపాటు ఆంక్షలు విధించడం చాలా అవసరమని సూచించింది. ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, దేశంలో అందరికీ వాక్సినేషన్‌ చేయించినప్పుడే ఈ కరోనా బెడద వదులుతుందని లేకుంటే అది భారత్‌ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.

భారత్‌లో కరోనా తీవ్రత, ప్రభుత్వాలు, ప్రజల తీరుపై నిశితంగా అధ్యయనం చేసిన కాన్పూర్ ఐఐటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బృందాలు ఆగస్ట్ 3వ వారం నుంచి కరోనా థర్డ్ వేవ్‌ మొదలవుతుందని ప్రకటించాయి. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరికలను బట్టి చూస్తే ఇంకా ముందే మొదలయ్యే అవకాశం ఉంది. 


Related Post