భారత్‌లో నేటికీ విమానం ఎక్కనివారు కోట్లాదిమంది ఉన్నారు. కానీ అమెరికాలో అంతరిక్ష పర్యాటక యాత్రలు కూడా మొదలైపోయాయి. ప్రపంచంలో తొలిసారిగా నిన్న అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పేస్ పోర్టు నుంచి స్పేస్‌షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ-22’తో అనుసంధానించబడిన విమానంలో ఆరుగురితో కూడిన బృందం విజయవంతంగా అంతరిక్ష పర్యాటక యాత్ర చేసుకొని భూమికి తిరిగివచ్చింది.
అమెరికా కాలమాన ప్రకారం ఉదయం 10.40 గంటలకు వారి స్పేస్‌షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ అంతరిక్షంలోకి దూసుకుపోయింది. భూమి నుంచి 88 కిమీ ఎత్తుకు చేరుకొని అంతరిక్ష పరిధిలోకి ప్రవేశించింది. అక్కడ కొంతసేపు భార రహిత స్థితిలో విహరించిన తరువాత మళ్ళీ క్షేమంగా స్పేస్ పోర్టులో వారి విమానం ల్యాండింగ్ అయ్యింది. ఈ ప్రక్రియ మొత్తం 90 నిమిషాలలో విజయవంతంగా ముగిసింది.
అమెరికాలోని 71 ఏళ్ళ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్‌సన్ ఎప్పటికైనా అంతరిక్షంలోకి వెళ్ళిరావాలని కలలు కంటుండేవారు. కానీ శిక్షణ పొందిన వ్యోమగాములకు తప్ప సామాన్య ప్రజలకు అంతరిక్షంలోకి వెళ్ళివచ్చేందుకు అవకాశం ఉండదు కనుక అంత డబ్బు ఖర్చు చేయగలిగిన ఎవరినైనా అంతరిక్ష యాత్ర చేయించాలని భావించి అంతరిక్ష పర్యాటక యాత్రల కోసమే ప్రత్యేకంగా 2004లో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం, వర్జిన్ అట్లాంటికి ఎయిర్‌వేస్ అనే సంస్థలను స్థాపించారు. అది స్థాపించిన ఇన్నేళ్ళకు తన సొంత స్పేస్‌షిప్‌లోనే అంతరిక్షంలో విహరించి తన కలను నెరవేర్చుకొన్నారు. అంతేకాదు... ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కమర్షియల్ స్పేస్‌షిప్‌లో అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన ఆరుగురు వ్యక్తులలో ఆయన కూడా నిలిచారు. ఈ బృందంలో గుంటూరుకు చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నారు.
విశేషమేమిటంటే ప్రైవేట్ రంగంలో అంతరిక్షయాత్రలు ఇంకా మొదలవక మునుపే అంతరిక్ష యాత్ర చేసేందుకు 600 మంది టికెట్స్ బుక్ చేసుకొన్నట్లు వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం సంస్థ తెలిపింది. ఒక్కో టికెట్ ధర సుమారు రూ.1.86 కోట్లు ఉంటుందని తెలిపింది. నిన్నటి ప్రయోగం విజయవంతం అవడంతో వచ్చే ఏడాది నుంచి అంతరిక్ష పర్యాటక యాత్రలు ప్రారంభించబోతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా అంతరిక్ష పర్యాటక యాత్రల కోసం సన్నాహాలు చేసుకొంటున్నారు. ఆయన కూడా ఈ నెల 20వ తేదీన తన సొంత స్పేస్‌షిప్‌లో అంతరిక్ష యాత్ర చేసేందుకు సిద్దమవుతున్నారు.