టిడిపికి ఎల్.రమణ గుడ్ బై

July 09, 2021


img

ఊహించినట్లే తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఫాక్స్ ద్వారా పంపించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకొనేందుకు టిఆర్ఎస్‌ పార్టీలో చేరబోతునట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టిడిపి దాదాపు కనుమరుగయ్యింది. ఎల్.రమణ రాజీనామాతో పార్టీ మూసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆయన  చేరిన తరువాత రాష్ట్రంలో మిగిలిన టిడిపి నేతలు, కార్యకర్తలను కూడా చేర్చుకొని టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేసుకొంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్ననే చెప్పారు. 

టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన మోత్కుపల్లి నర్సింహులు ఈ ప్రతిపాదన ఎప్పుడో చేశారు. రాష్ట్రంలో వాస్తవ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని చంద్రబాబునాయుడుకి సూచించినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. కానీ చివరకు ఆయన చెప్పినట్లే జరుగబోతోంది. 

ఒకప్పుడు సమైక్య రాష్ట్రాన్ని ఏలిన టిడిపి, ఇప్పుడు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో మనుగడ కోసం పోరాడుతుండటం స్వయంకృతాపరాధామే అని చెప్పాలి. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నప్పటికీ అందరికీ తెలిసిన కారణం చేత తెలంగాణ రాజకీయాలలో తలదూర్చలేక పార్టీని కాపాడుకోలేకపోయారు. ఏపీలో టిడిపి అధికారం కోల్పోవడానికి కూడా స్వయంకృతాపరాధాలే కారణం అని అందరికీ తెలుసు. తెలంగాణలో టిడిపి అవశేషాన్ని ఇప్పుడు ఆయన ఎవరికి అప్పగిస్తారో చూడాలి.


Related Post