తెలంగాణలో మరో పార్టీకి చోటు ఉందా?

July 08, 2021


img

ఇవాళ్ళ సాయంత్రం హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌ టిపి) ఆవిర్భవించింది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా రాజకీయ శూన్యత ఉన్నప్పుడు కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ రెండూ లేవు. కానీ వైఎస్సార్‌ టిపి నేడు జన్మించింది. అయితే వైఎస్సార్‌ టిపి రాష్ట్రంలో నిలద్రొక్కుకొని టిఆర్ఎస్‌కు పోటీ ఇవ్వగలదా? ఓడించి అధికారంలోకి రాగలదా? అనే ప్రశ్నలకు రాష్ట్రంలో వాస్తవ రాజకీయ పరిస్థితులను పరిశీలించవలసి ఉంటుంది.     

రాష్ట్రంలో రెండో స్థానం కొరకు కాంగ్రెస్‌, బిజెపిలు పోరాడుకొంటున్నాయి. ఒకప్పుడు సమైక్య రాష్ట్రాన్ని ఏలిన టిడిపి టిఆర్ఎస్‌ ధాటికి కనబడకుండా పోయింది. ఇవికాక వామపక్షాలు, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ వంటివి మరికొన్ని ఉన్నాయి. కానీ అవేవీ ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి రాలేకపోయాయి. కనీసం ఒకటి రెండు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకోలేక చతికిలపడుతున్నాయి. ఒక్కోసారి టిఆర్ఎస్‌ ధాటికి కొమ్ములు తిరిగిన కాంగ్రెస్‌, బిజెపిలకే డిపాజిట్లు దక్కడం లేదు. కనుక రాష్ట్రంలో మరో పార్టీకి చోటు లేదు ఒకవేళ వచ్చినా ఫలితం ఉండబోదని స్పష్టం అవుతోంది.    

కనుక మొదటే ‘ఆంధ్రాపార్టీ’గా ముద్ర పడిన వైఎస్సార్‌ టిపి తెలంగాణ ప్రజలను ఏవిదంగా ఆకర్షించగలదు?ప్రజాబలం లేకుండా టిఆర్ఎస్‌తో ఏవిదంగా పోటీ పడగలదు?అనే ప్రశ్నలకు ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ పరిస్థితులను, ప్రజల ఆలోచనా ధోరణిని, వారిపై సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభావాన్ని అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే, వైఎస్సార్‌ టిపి ఎన్నికలలో ఓట్లు చీల్చగలదేమో కానీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని చెప్పవచ్చు. ఈవిషయం ఆ పార్టీని స్థాపిస్తున్న వైఎస్ షర్మిలకు తెలియదనుకోలేము. మరి ఏ నమ్మకంతో...ఏ ఉద్దేశ్యంతో పార్టీని స్థాపిస్తున్నారు? అనే ప్రశ్నకు వచ్చే శాసనసభ ఎన్నికలలోగానే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది.


Related Post