జల జగడాలతో పార్టీల పిలకలు కేంద్రం చేతిలోకి

July 08, 2021


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య జల జగడాలు దేని కోసం జరుగుతున్నయనేది పక్కన పెడితే, వాటితో అధికార టిఆర్ఎస్‌, వైసీపీల పిలకలు కేంద్రం చేతికి పరోక్షంగా బిజెపి చేతికి చిక్కడం ఖాయం. రెండు రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి చేసుకొంటున్న పిర్యాదులు, ఆరోపణలు, ఈ సందర్భంగా అవి బయటపెట్టుకొంటున్న రహస్యాలు అన్నీ బిజెపి చేతికి అస్త్రాలుగా అందుతున్నాయని చెప్పవచ్చు. అందుకే ఈ వ్యవహారంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్రాస్తున్న లేఖలు, చేస్తున్న విజ్ఞప్తులపై కేంద్రం స్పందించకుండా వేచి చూస్తున్నట్లు భావించవచ్చు. 

ఈ జల జగడాలతో రెండు రాష్ట్రాలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని అందరికీ తెలుసు. అయినా ఎందుకు రెండు రాష్ట్రాలు గొడవపడుతున్నాయి?అని ప్రశ్నించుకొంటే టిఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నికల కోసం, ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై వినిపిస్తున్న అనేక విమర్శలు, ఆరోపణలను కప్పి పుచ్చుకోవడానికి అనే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ హుజూరాబాద్‌ ఉపఎన్నికలు ముగియగానే ఈ జలజగడాలు నిలిచిపోతే ఇది రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ఉత్తుత్తి పోరాటాలే అని స్పష్టం అవుతుంది. 

కానీ ఏ కారణంతో అవి గొడవ పడుతున్నప్పటికీ వాటితో టిఆర్ఎస్‌, వైసీపీలు ఆశిస్తున్న ఫలితం లేదా లాభం కంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు ఈవిదంగా అనైఖ్యతతో వ్యవహరిస్తుంటే లేదా ఆవిదంగా ఉన్నట్లు నటిస్తున్నా తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్న బిజెపి వాటిని అవకాశంగా మలుచుకొని లబ్ది పొందాలని ప్రయత్నించక మానదు. అలాగే ఈ వంకతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి అణిగిమణిగి ఉండవలసి వస్తుంది.


Related Post